అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వీరేన్ మర్చంట్ ముద్దుల కూతురు రాధికా మర్చంట్ మెడలో అనంత్ మూడు ముళ్లు వేశారు. శుక్రవారం రాత్రి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వివాహ వేడుక కన్నుల పండుగలా జరిగింది. పెళ్లి సంబరాలకు దేశ విదేశాలకు చెందిన సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పెళ్లిలో రాధిక మర్చంట్ వేసుకున్న డ్రెస్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది.
సింపుల్‌గా చప్పాలంటే ఈ డ్రెస్‌లో దేవకన్యలా కనిపించారు రాధికా మర్చంట్. ప్రముఖ డిజైనర్ సందీప్ ఖోస్లా రాధికా మర్చంట్ పెళ్లి బట్టలను స్పెషల్‌గా డిజైన్ చేశారు. ఎరుపు, గోధుమ వర్ణంలో ఈ డ్రెస్‌ను రూపొందించారు. పూర్తిస్థాయి గుజరాతీ సంప్రదాయ పద్దతిలో అవుట్‌ఫిట్ డిజైన్ చేశారు. ఈ డ్రెస్‌కు సంబంధించి ఎంబ్రాయిడరీ పూర్తిగా చేతితో వేశారు. ఘాగ్రాకు విలువైన డైమెండ్స్ పొదిగారు. 5 మీటర్ల పొడవున్న ఈ ఘాగ్రా హెడ్ వీల్, టిష్యూ షోల్డర్తో సహా మూడు అంచుల్లో మెరుస్తూ కనిపిస్తుంది. తంబా టిక్కీలు, రెడ్ రేషమ్తో అత్యంత లగ్జరీగా దీన్ని రూపొందించారు.
తల మీద ఉండే ముసుగు అత్యంత సున్నితమైన జాలీ కట్ వర్క్‌ను కలిగి ఉంది. మొత్తంగా వెడ్డింగ్ డ్రెస్‌లో రాధిక మర్చంట్ యువరాణిలా కనిపించారు. బంధుమిత్రుల కోలాహలాలు, బ్యాండ్ బాజాల సందడి నడుమ అనంత్ పెళ్లి మండపానికి చేరుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం అనంత్, రాధిక పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత నిర్వహించి బారాత్ కోలాహాలంగా జరిగింది. సంప్రదాయ నృత్యాలతో పాటు పలువురు సెలబ్రిటీలు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. పెళ్లి కొడుకు అనంత్ అంబానీ, పెళ్లి కూతురు రాధికా మర్చంట్ కూడా స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు.