టీమిండియా బ్యాటర్ కెెఎల్ రాహుల్ ను నెటిజన్లు ఆడుకుంటున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కాసేపు కూడా క్రీజులో నిలబడవా అంటూ ఫైర్ అవుతున్నారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో నాలుగోరోజు సర్ఫరాజ్ ఖాన్ , పంత్ ఔటైన తర్వాత కెఎల్ రాహుల్ మీద ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. టాపార్డర్ బ్యాటర్లు రాణించిన పిచ్ పై మిడిలార్డర్ లో వచ్చిన రాహుల్ ఎంత బాధ్యతగా ఆడాలి… కానీ రాహుల్ మాత్రం కాసేపు కూడా క్రీజులో నిలవలేకపోయాడు. 12 పరుగులకే ఔటయ్యాడు. రాహుల్ సీనియర్ బ్యాటర్… అలాంటి ఆటగాడు లోయర్ ఆర్డర్ తో కలిసి పార్టనర్ షిప్స్ నెలకొల్పేందుకు చక్కని అవకాశముంది. ఎందుకంటే బెంగళూరు పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలించడం లేదు. ఇదే పిచ్ పై రోహిత్ , కోహ్లీ సెంచరీలు చేస్తే… యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ 150 రన్స్ , పంత్ 99 పరుగులు చేశారు. వీరిద్దరూ ఔటైన తర్వాత రాహుల్ నుంచి అభిమానులు మంచి ఇన్నింగ్స్ ఆశిస్తే 12 రన్స్ కే ఔటవడం అందరినీ నిరాశకు గురి చేసింది.
రాహుల్ పై నమ్మకం పెట్టుకోవడమే దండగ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రెండో టెస్ట్ సమయానికి గిల్ కోలుకుంటే సర్ఫరాజ్ , రాహుల్ మధ్య గట్టిపోటీ నెలకొంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ కంటే సర్ఫరాజ్ వంద రెట్లు బెటరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు ఇన్నింగ్స్ లలోనూ రాహుల్ ఫెయిలవగా… సర్ఫరాజ్ మాత్రం రెండో ఇన్నింగ్స్ లో శతకంతో అదరగొట్టాడు. కీలకమైన పార్టనర్ షిప్ తో జట్టుకు భారీస్కోర్ అందించాడు. అదే సమయంలో రాహుల్ ఫ్లాప్ షో కంటిన్యూ అవడంతో రెండో టెస్టుకు సర్ఫరాజ్ వైపే టీమిండియా మేనేజ్ మెంట్ మొగ్గుచూపుతుందని భావిస్తున్నారు. వచ్చే నెలలో బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ, కోసం టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాకు వెళ్ళబోతోంది. అక్కడ ఐదు టెస్టుల సిరీస్ లోనూ రాహుల్ లాంటి సీనియర్ ప్లేయర్ కీలకమే… కానీ ఫామ్ లో లేకుంటే మాత్రం తుది జట్టులో చోటు దక్కడం కష్టమని చెప్పొచ్చు.
సీనియర్ బ్యాటర్ గా ఒకవేళ రెండో టెస్టులోనూ చోటు దక్కించుకుంటే మాత్రం ఖచ్చితంగా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిందే. లేకుంటే ఆసీస్ తో సిరీస్ లోనూ తుది జట్టు ప్లేస్ గాయబ్ అవుతుంది. ఇటీవల బంగ్లాదేశ్ పై బాగానే రాణించిన రాహుల్ కు కివీస్ తో సిరీస్ చివరి అవకాశం. ఇప్పటి వరకూ కెరీర్ లో 53 టెస్టులు ఆడిన కెఎల్ రాహుల్ 2981 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇంగ్లాండ్ తో సిరీస్ లో టెస్ట్ అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ అదరగొడుతున్నాడు. తాజాగా కివీస్ పై శతకంతో పాటు గత సిరీస్ లో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. అటు దేశవాళీ క్రికెట్ లోనూ పరుగుల వరద పారిస్తుండడంతోనే సెలక్టర్లు అతన్ని ఎంపిక చేస్తున్నారు. మొత్తం మీద రాహుల్ స్థానానికి సర్ఫరాజ్ నుంచి ముప్పుందని మాత్రం అర్థమవుతోంది.