ఆయన హర్ట్ చేశాడు, లక్నో ఓనర్ పై రాహుల్ ఫైర్

ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్... ఫ్రాంచైజీ కొన్న యజమానులు జట్టుపై చాలా అంచనాలు పెట్టుకుంటారు... తమ టీమ్ గెలవాలని కోరుకోవడంలో తప్పులేదు.. కానీ ఇదే అదునుగా వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ పై నోరుపారేసుకుంటే.. అది కూడా అందరిలోనూ అవమానించడం సరికాదు..

  • Written By:
  • Publish Date - November 15, 2024 / 02:59 PM IST

ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్… ఫ్రాంచైజీ కొన్న యజమానులు జట్టుపై చాలా అంచనాలు పెట్టుకుంటారు… తమ టీమ్ గెలవాలని కోరుకోవడంలో తప్పులేదు.. కానీ ఇదే అదునుగా వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ పై నోరుపారేసుకుంటే.. అది కూడా అందరిలోనూ అవమానించడం సరికాదు.. సరిగ్గా ఇలాంటి ఘటనకే 2024 ఐపీఎల్ సీజన్ వేదికగా నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా అందరి ముందు తమ కెప్టెన్ కెఎల్ రాహుల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం షాక్ కు గురిచేసింది. ఆ సీజన్ లో సన్ రైజర్స్ తో మ్యాచ్ లో లక్నో మంచి స్కోరే చేసినా బౌలర్లు విఫలమవడంతో ఓడిపోయింది. సన్ రైజర్స్ కేవలం 9 ఓవర్లలోనే 166 పరుగుల టార్గెట్ ను ఛేదించేసింది. ఈ ఓటమిని తట్టుకోలేకపోయిన లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా మ్యాచ్ అనంతరం బౌండరీ దగ్గరే రాహుల్‌పై తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేశాడు. అప్పట్లో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటన తర్వాత రాహుల్ కూ, లక్నో యాజమాన్యానికి దూరం పెరిగింది. అందరూ ఊహించినట్టుగానే రాహుల్ వేలంలోకి వచ్చేశాడు. తనకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చే జట్టులో ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు ఇటీవల వ్యాఖ్యానించాడు. తాజాగా మరోసారి అప్పటి ఘటనపై మాట్లాడాడు. ప్లే ఆఫ్స్ చేరేందుకు చివరివరకూ ప్రయత్నించామని గుర్తు చేసుకున్నాడు. చివరి ఐదు మ్యాచుల్లోనూ మూడు గెలిస్తే అవకాశం ఉండేదనీ, అప్పుడే ఆ ఘటన జరిగిందంటూ చెప్పుకొచ్చాడు. మైదానంలో ఏం జరిగినా ఫర్వాలేదు కానీ.. మ్యాచ్‌ తర్వాత చోటుచేసుకున్న సన్నివేశాలు సరిగ్గా లేవంటూ సంజీవ్ గోయెంకాకు చురకలంటించాడు. ఆ ఘటన జట్టుపై తీవ్ర ప్రభావం చూపించన్నాడు. అప్పటివరకు జరిగినవన్నీ పక్కన పెట్టి ఆడినా ఫలితం దక్కలేదంటూ వ్యాఖ్యానించాడు.

ఇదిలా ఉంటే రిటెన్షన్ తర్వాత సంజీవ్ గోయెంకా రాహుల్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గెలవాలన్న మైండ్ సెట్ తో ఉన్న ప్లేయర్స్ నే తాము రిటెయిన్ చేసుకున్నట్లు అతడు చెప్పాడు. తర్వాత ఈ కామెంట్స్ పై రాహుల్ కూడా కౌంటర్ ఇచ్చాడు. తాను టీమ్ లో నుంచి వెళ్లిపోవాలని ముందే డిసైడ్ అయ్యానని, కాస్త ఫ్రీడమ్ ఉండే జట్టు కోసం చూస్తున్నట్లు అతడు చెప్పాడు. టీమ్ వాతావరణం కాస్త బాగుండి, సమతుల్యంగా ఉండాలని అనుకున్నట్టు రాహుల్ చెప్పుకొచ్చాడు.