ఒకప్పుడు పప్పు అంటూ విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో పొలిటికల్ ఇమేజ్ పెంచుకున్నారు. రాజకీయాలకు అతీతంగా సామాన్యలను కలవడం, వాళ్ల కష్ట సుఖాలను తెలుసుకోవడం, వాళ్లతో సమయం కేటాయించడం ఇలా రొటీన్ రాజకీయాలకు భిన్నంగా ముందుకెళుతున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర కారణంగానే వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పుంజుకుంటుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో బలంగా ఉంది. మొదటి విడత అందించిన సక్సెస్ ను కర్ణాటక ఎన్నికల రూపంలో చూసిన కాంగ్రెస్ పార్టీ ఈసారి భారీ వ్యూహాలతో ముందుకెళుతుంది.
పశ్చిమం నుంచి ఈశాన్యం వైపు అడుగులు
మొదటి విడత భారత్ జోడో యాత్రను కన్యాకుమారి నుంచి ప్రారంభించి శ్రీనగర్ లో ముగించిన రాహుల్ గాంధీ.. ఈసారి గుజరాత్ నుంచి త్రిపుర వరకు అడుగులు వేయాలనుకుంటున్నారు. మహాత్మాగాంధీ జన్మస్థలం గుజరాత్ లోని పోర్‌బందర్ నుంచి ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాజధాని అగర్తలా వరకు జోడో యాత్ర 2.0 కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 15 లేదా..సెప్టెంబర్ నుంచి భారత్ జోడో యాత్ర 2.0 మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టార్గెట్ మోడీ.. ఇదే రాహుల్ ఎజెండా
కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస పరాజయాలతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ఎన్నికలు ఆక్సిజన్ అందించాయి. ఇక కాంగ్రెస్ పని అయిపోయింది.. కాంగ్రెస్ ముక్త భారత్ దిశగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది అనుకుంటున్న సమయంలో.. ఐసీయూ నుంచి ప్రాణాలతో బయటపడ్డ వాడిలా కాంగ్రెస్ కు కొత్త ఊపిరి అందింది. మోడీ ఈ దేశాన్ని అదానీ వంటి కార్పోరేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారని పదేపదే విమర్శలు గుప్పిస్తున్న రాహుల్ గాంధీ.. ఇండియా కూటమి సహకారంతో 2024లో మోడీని ఓడించాలని చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపైనా, బీజేపీ ఆలోచనలపైనా దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉన్నా మోడీ గ్రాఫ్ ఇప్పటికీ పడిపోలేదు. ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ మరోసారి భారత్ జోడో యాత్రతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేయబోతున్నారు.
అటు అసెంబ్లీ.. ఇటు పార్లమెంట్..
ఈ ఏడాది చివరిలోపు తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ , మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన కొన్ని నెలలకే పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. దీంతో భారత్ జోడోయాత్రను అటు అసెంబ్లీ..ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రయోజనకరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రూట్ మ్యాప్ ఎలా ఉండాలన్న దానిపై జోడోయాత్ర కో ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు దిగ్విజయ్ సింగ్.. ఇప్పటికే సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
ఈసారి యూపీపై ఫోకస్ పెంచుతారా?
కేంద్రంలో ఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నది యూపీ ఫలితాలు డిసైడ్ చేస్తాయి. యూపీలో 80 పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. ఇవే ఢిల్లీలో గెలుపోటములను శాశిస్తాయి. అందుకే పోర్‌బందర్ టు అగర్తలా రూట్ మ్యాప్‌లో యూపీ పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి విడత యాత్రలో రాహుల్ యూపీలో కేవలం మూడు జిల్లాల మాత్రమే కవర్ చేశారు. యూపీలో 130 కి.మీ పాటు రాహుల్ యాత్ర సాగినా.. అక్కడి కాంగ్రెస్ శ్రేణులు సంతృప్తి వ్యక్తం చేయలేదు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసారి మెజార్టీ నియోజకవర్గాలను టచ్ చేసేలా యాత్రను డిజైన్ చేయాలని యూపీ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. రాహుల్ మరోసారి పాదయాత్ర మొదలు పెడితే.. కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం రావడం ఖాయం. అయితే జోడోయాత్ర 2.0 ఎన్నికలను ఏమాత్రం ప్రభావితం చేస్తుందన్నది మాత్రం ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది.