T-Congress: తెలంగాణలో కాంగ్రెస్ బస్సు యాత్ర.. పాల్గొననున్న రాహూల్ గాంధీ

తెలంగాణలో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా తన దూకుడును ప్రదర్శిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ అలా విడుదలైందో లేదో భవిష్యత్ కార్యచరణను రచిస్తూ ముందుకు సాగుతోంది. ఈనేపథ్యంలోనే రాహూల్ గాంధీ సహా టీ కాంగ్రెస్ సీనియర్ నేతలతో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - October 10, 2023 / 07:58 AM IST

తెలంగాణలో ఎన్నికల నగారా మ్రోగింది. నవంబర్ 3 నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. నవంబర్ 30న పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు సిద్దమైంది. అందులో భాగంగా బస్సు యాత్రను చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు సీనియర్ నాయకులు. దీనిపై ఈరోజు సాయంత్రం గాంధీభవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

ఒకే వేదికపై సీనియర్ నేతల ప్రచారం..

అక్టోబర్ 14 నుంచి బస్సు యాత్ర చేపట్టి రాష్ట్రస్థాయిలో ప్రచారం కల్పించాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇప్పటి వరకూ సీనియర్ నేతలు రేవంత్ మొదలు బట్టి విక్రమార్క వరకూ అనేక రకాలా పాదయాత్రలు చేశారు. అయితే ఇవన్నీ విడివిడిగా వారి వారి నియోజక వర్గాల్లో చేసినవే. అయితే ఈసారి అందరూ సీనియర్ నాయకులు ఒకే వేదికగా యాత్ర చేపట్టడమే దీని ప్రత్యేకతగా చెబుతున్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం మాలో ఎలాంటి విభేదాలు లేవని ప్రజలకు సందేశాన్నిచ్చేందుకు దీనిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అదే క్రమంలో తమను గెలిపిస్తే ఏం చేస్తామో తుక్కుగూడ సభ సాక్షిగా చెప్పామంటున్నారు కాంగ్రెస్ నాయకులు.

బస్సుయాత్రలో రాహూల్ గాంధీ..

ఈ బస్సు యాత్ర ఈనెల 14 న ప్రారంభం అయితే 19,20,21 తేదీల్లో రాహూల్ గాంధీ పాల్గొంటారని తెలుస్తోంది. అప్పటికే యాత్ర ఉత్తర తెలంగాణలో కొనసాగేలా రూట్ మ్యాప్ ను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే 119 నియోజకవర్గాలకు గానూ సగానికి పైగా అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే వామపక్షాలతో పొత్తు కుదిరే అవకాశం ఉన్నందున వారికి కేటాయించాల్సిన సీట్ల విషయంలో భాగంగానే ఇంకా జాబితా విడుదల చేయలేదంటున్నారు కొందరు నేతలు. పొత్తు విషయంపై ఈ వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని.. వారికి కేటాయించే స్థానాలను పక్కన పెట్టి మిగిలిన చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే చర్చలు జరిపి కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితాను పంపించారు. ఈ వారం లేదా 10 రోజుల్లో స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

T.V.SRIKAR