రాహుల్ పాస్..రోహిత్ ఫెయిల్ ,హిట్ మ్యాన్ ఫ్లాప్ షో

పింక్ బాల్ టెస్టులో భారత బ్యాటర్లు నిరాశపరిచారు. అంచనాలు పెట్టుకున్న స్టార్ ప్లేయర్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. జైశ్వాల్ డకౌటవగా...కోహ్లీ, పంత్ విఫలమయ్యారు. అయితే జట్టు కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ మిడిలార్డర్ లోనూ ఫెయిలయ్యాడు.

  • Written By:
  • Publish Date - December 6, 2024 / 06:36 PM IST

పింక్ బాల్ టెస్టులో భారత బ్యాటర్లు నిరాశపరిచారు. అంచనాలు పెట్టుకున్న స్టార్ ప్లేయర్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. జైశ్వాల్ డకౌటవగా…కోహ్లీ, పంత్ విఫలమయ్యారు. అయితే జట్టు కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ మిడిలార్డర్ లోనూ ఫెయిలయ్యాడు. చాలా కాలంగా టెస్టుల్లో ఫామ్ కోల్పోయిన రోహిత్ ఈ మ్యాచ్ లో 3 పరుగులకే వెనుదిరిగాడు. హిట్ మ్యాన్ ఏ దశలోనూ కంఫర్ట్ గా ఆడినట్టు కనిపించలేదు. పైగా పింక్ బాల్ తో ఆసీస్ పేసర్లు బాగానే ఇబ్బంది పెట్టడంతో 23 బంతులాడి 3 పరుగులకే ఔటయ్యాడు. దీంతో రోహిత్ ఓపెనింగ్ స్థానంపై మళ్ళీ చర్చ మొదలైంది. రీర్ ఆరంభంలో మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్ శర్మ.. మళ్లీ 6 ఏళ్ల తర్వాత అదే స్థానంలో బరిలోకి దిగాడు.ఈ ఇన్నింగ్స్ తర్వాత అసలు మిడిలార్డర్‌లో రోహిత్ శర్మ గణంకాలు ఎలా ఉన్నాయనేది ఫ్యాన్స్ వెతుకుతున్నారు.

2018లో చివరిసారిగా మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగి అసాధారణ ప్రదర్శనతో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇన్నాళ్లకు మళ్లీ రోహిత్ మిడిలార్డర్‌లో ఆడాల్సి వచ్చింది. ఇప్పటి వరకు రోహిత్ శర్మ మిడిలార్డర్‌లో 30 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. మూడో స్థానంలో 4 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేసి 107 పరుగులే చేశాడు. నాలుగో స్థానంలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన రోహిత్ 4 పరుగులే చేశాడు. ఐదో స్థానంలో 9 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 3 హాఫ్ సెంచరీలతో 437 రన్స్ కొట్టాడు. ఆరో స్థానంలో 16 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో 1037 రన్స్ చేశాడు. మిడిలార్డర్‌లో రోహిత్ నాలుగు సార్లు డకౌటయ్యాడు. పింక్ బాల్ టెస్ట్‌లోనూ రోహిత్ శర్మ 6వ స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు.

నిజానికి ఆరో స్థానంలో రోహిత్ కు మంచి రికార్డే ఉంది… కానీ పింక్ బాల్ టెస్టులో పిచ్ పేసర్లకు సహకరించడం, హిట్ మ్యాన్ ఫామ్ లో లేకపోవడం వంటివి ఎఫెక్ట్ చూపించాయి. ఈ ఏడాది రోహిత్ శర్మ టెస్ట్ ఫామ్ స్థాయికి తగినట్టు లేదు. గత ఆరు మ్యాచ్ లలో కేవలం 136 పరుగులే చేశాడు. గత ఐదు ఇన్నింగ్స్ లలో ఒక్కసారి కూడా ట్వంటీ ప్లస్ స్కోర్ చేయలేకపోయాడు. ఇప్పుడు మిడిలార్డర్ లో కూడా విఫలమవడంతో రోహిత్ మూడో టెస్టుకు ఏ స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడనేది ఆసక్తికరంగా మారింది. జట్టు ప్రయోజనాలే ముఖ్యమని చెప్పిన హిట్ మ్యాన్ మూడో టెస్టులో కూడా మిడిలార్డర్ లో బరిలోకి దిగి సత్తా చాటుతాడేమో చూడాలి.