ఒక్క టికెట్ కోసం సదరు ప్రయాణీకుడు పడే అగచాట్లు అన్నీ ఇన్ని కాదు. మరి కోచ్ మొత్తం, రైలు మొత్తం బుక్ చేసుకోవాలంటే ఇంకెన్ని తిప్పలుపడాలో అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఇది చాలా సులభం. దీనికోసం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేసింది రైల్వేశాఖ. ఇలా ఎక్కువ సంఖ్యలో టికెట్లు బుకింగ్ చేసుకోవడానికి ఐ ఆర్ సీ టీ సీ ఫుల్ తారీఫ్ రేట్ (https://ftr.irctc.co.in/ftr/) అనే సైట్లోకి వెళ్లాలి. సైట్ ఓపెన్ అయిన వెంటనే మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. ఆతరువాత లాగిన్ అయి మనం ఏ ట్రైన్ కు సంబంధించిన కోచ్ లేదా ట్రైన్ మొత్తం కావాలనుకుంటున్నామో వాటి వివరాలు నమోదు చేయాలి. మీరు ఏ స్టేషన్ నుంచి ఎక్కడి వరకూ ప్రయాణిస్తారు అనే వివరాల గురించి ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో మన హోం స్టేషన్ ను డెస్టినేషన్ ను ఎంటర్ చేసుకోవాలి. ఇలా చేసిన తరువాత కోచ్ కి సంబంధించిన వివరాలు పొందుపరచాలి. మీరు ఏసీ బోగి కోరుకుంటున్నారా.. లేకుంటే స్లీపర్ క్లాస్ కోరుకుంటున్నారా అనేది అక్కడ పొందుపరచాలి. మీరు ఎంపిక చేసుకున్న రోజుకు ఖాళీ ఉంటే రైల్వే మీకు ఆ కోచ్ ను కేటాయిస్తుంది.
బుక్ చేసుకోవాలంటే ఈ రూల్స్ తప్పనిసరి..
ఎఫ్ టీ ఆర్ బుకింగ్ చేసే సమయంలో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తొచ్చు. వీటిని దృష్టిలో పెట్టుకునే రైల్వే అధికారులు మనం కోరుకున్న కోచ్, ట్రైన్ ను కేటాయిస్తారు. మనకు కన్షర్మేషన్ వచ్చేంత వరకూ వేచి ఉండాలి. ఈ బుకింగ్ ను కనీసం ఆరు నెలల ముందుగా చేసుకోవాలి. అలా కుదరకుంటే కనీసం 30 రోజుల ముందైనా బుక్ చేసుకోవచ్చు. సీట్ల అందుబాటును బట్టి మనకు కోచ్ కేటాయిస్తారు. కోచ్ లను ఇంజన్ కు యాడ్ చేసేందుకు, తొలగించేందుకు రైలు కనీసం 10 నిమిషాలు నిలిపే స్టేషన్ల నుంచే బుకింగ్ కు అనుమతినిస్తారు. అంటే.. మనం బుక్ చేసుకున్న స్టేషన్లో రైలు కనీసం 10 నిమిషాలు దాని రోజూ వారి షెడ్యూల్ ప్రకారం ఆగేలా ఉండాలి. అప్పుడే మనం ఆ ప్రాంతం నుంచి ట్రైన్ లేదా కోచ్ బుక్ చేసుకునేందుకు అర్హులం అనమాట.
మనం బుక్ చేసుకునే ట్రాక్ ప్రకారం, అందులో ఎక్కే బంధువులకు సంబంధించిన వివరాలు అన్ని కరెక్ట్ గా ఉన్నట్లయితే పేమెంట్ ఆప్షన్ లోకి వెళ్లచ్చు. మనకు ఉన్న బంధువుల సంఖ్యను బట్టి కోచ్ అయినా బుక్ చేసుకోవచ్చు. లేకుంటే 18 నుంచి 24 బోగీల మొత్తం ట్రైన్ అయినా బుక్ చేసుకోవచ్చు. అయితే ప్రతి కోచ్ కి రూ. 50 వేల రూపాయలు అడ్వాన్స్ డిపాజిట్ రూపంలో ముందుగా చెల్లించాలి. ఇప్పుడు మనకు 24 కోచ్ లు కలిగిన ట్రైన్ కావాలనుకుంటే రూ. 12 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ లాగా చెల్లించాలి. అదే రెండు బోగీలు చాలనుకుంటే రూ. లక్ష పే చేయాలి. మన ప్రయాణం పూర్తి అయిపోయిన తరువాత తిరిగి మన డబ్బులు మనకు ఇచ్చేస్తారు. ఈ టికెట్లలో ఎలాంటి రాయితీలు ఉండవు. మన కుటుంబసభ్యులలో సీనియర్ సిటిజన్స్, రైల్వే ఎంప్లాయిస్ వంటి పాస్ లు ఇక్కడ వర్తించవు.
రైల్వేశాఖ అందించే సేవలు..
ట్రైన్ బుక్ చేసుకున్న తరువాత అందులో మనకు కావల్సిన ఫుడ్ ఐ ఆర్ టీ సీ అందిస్తుంది. కోచ్ క్లీనింగ్, బుకింగ్ సమస్యలు ఏవైనా తలెత్తితే జోనల్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సాగుతుంది కాబట్టి తక్షణం చర్యలు తీసుకుంటారు. రైల్వేశాఖ తప్పిదం వల్ల ప్రమాదవశాత్తు ఏమైనా సంఘటనలు జరిగితే ప్రయాణించే ప్రతి ఒక్కరికి ఇన్సురెన్స్ కూడా వర్తిస్తుంది. మనం అడిగితే ప్రత్యేకమైన డెకరేషన్ తో కూడా ఏర్పాటు చేసేందుకు రైల్వే అధికారులు సుముఖంగా ఉంటారు. దీనికి ప్రత్యేకంగా డబ్బులు చెల్లించవలసి ఉంటుంది.
ఇలా పెళ్లిళ్లకు, విహారయాత్రలకు సుదూర ప్రయాణాలకు ముందస్తుగా బుకింగ్ చేసుకొని మన జర్నీని సుఖమయం, క్షేమదాయకంగా కొనసాగించవచ్చు.
T.V.SRIKAR