ఐపీఎల్ మెగావేలానికి ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ ఇటీవలే ఖరారు చేయడంతో తమ జాబితాపై కసరత్తు చేస్తున్నాయి. ఈ సారి ఆరుగురి వరకూ బీసీసీఐ రిటెన్షన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పలువురు కీలక ఆటగాళ్ళు తమ పాత ఫ్రాంచైజీలతోనే కొనసాగనున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్ జాబితాపై క్లారిటీ వచ్చింది. రాయల్స్ పక్కా స్కెచ్ తో వేలానికి సిధ్ధమవుతోంది. రిటైన్ జాబితాలో కెప్టెన్ సంజూ శాంసన్ ఖచ్చితంగా ఉంటాడు. సారథిగానే కాకుండా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా సంజూ అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సీజన్ లో పరుగుల వరద పారించిన ఈ కేరళ క్రికెటర్ 531 రన్స్ చేయగా.. అందులో ఐదు హాఫ్ సెంచరీలున్నాయి.
అలాగే విదేశీ ప్లేయర్స్ లో జాస్ బట్లర్ ను కూడా రాయల్స్ రిటైన్ చేసుకోనుంది. బట్లర్ గత సీజన్ లో అదరగొట్టాడు.11 మ్యాచ్ లలో ఒక సెంచరీతో 359 పరుగులు చేశాడు. ఇక ఓపెనర్ గా రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభాలనిస్తున్న యశస్వి జైశ్వాల్ కూడా రాజస్థాన్ జట్టుతోనే కొనసాగనున్నాడు. జైశ్వాల్ గత సీజన్ లో మెరుపులు మెరిపించాడు. ఒక సెంచరీతో 435 పరుగులు చేసిన జైశ్వాల్ ఎట్టిపరిస్థితుల్లోనూ రాయల్స్ వదులుకోదు. మరోవైపు బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బౌల్ట్ ను రిటైన్ చేసుకోవడం ఖాయం. రాయల్స్ పేస్ ఎటాక్ ను లీడ్ చేస్తున్న ఈ కివీస్ బౌలర్ గత సీజన్ లో 16 వికెట్లు తీశాడు. స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ కూడా రాజస్థాన్ రిటైన్ జాబితాలో ఉండడం ఖాయం. కీలక సమయంలో వికెట్లు తీసే స్పిన్నర్ గా చాహల్ కు పేరుంది. గత సీజన్ లో చాహల్ 18 వికెట్లు పడగొట్టాడు. ఇక అన్ క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో పేసర్ సందీప్ శర్మను రాజస్థాన్ రిటైన్ చేసుకునే అవకాశాలున్నాయి.