నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గద్దె గాయత్రి కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. 38 ఏళ్ళకే కార్డియాక్ అరెస్ట్ తో గాయత్రి మృతి చెందడం పట్ల సినీ రాజకీయ ప్రముఖులు విషాదం వ్యక్తం చేస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఏఐజీ ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు… ముందు గ్యాస్ నొప్పి అనుకుని లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే నొప్పి తీవ్రం కావడంతో… ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది గాయత్రి.
రాజేంద్ర ప్రసాద్ కు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేసారు. అయితే ఆమె మృతి చెందిన సమయంలో రాజేంద్ర ప్రసాద్ సినిమా షూటింగ్ లో ఉన్నారట. అక్కడి నుంచి వార్త విన్న వెంటనే నేరుగా… ఆస్పత్రికి వచ్చారట. అప్పటికే గాయత్రి మరణించారు అని తెలియడంతో రాజేంద్ర ప్రసాద్ కుప్ప కూలిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక గాయత్రి జీవితం విషయానికి వస్తే… ఆమె జీవితం మొత్తం విషాదాలే అని తెలుస్తోంది. తండ్రి మాటను కాదని ఆమె ప్రేమ వివాహం చేసుకుని దూరమయ్యారు.
ప్రేమ వివాహంలో కూడా ఆమె అనేక ఇబ్బందులు పడ్డారట. తన కూతురు తనకు దూరం కావడంతో రాజేంద్ర ప్రసాద్ చాలా విధాలుగా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. చివరకు రాజేంద్ర ప్రసాద్ రాజీ పడగా ఆమె కొన్నాళ్ళ క్రితమే తండ్రికి దగ్గరయ్యారు. ఆమె కుమార్తెనే రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లోకి కూడా తీసుకొచ్చారు. తాను 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు తల్లి చనిపోయిందని ఆ తర్వాత తన తల్లిని తన కూతురిలో చూసుకున్నాను అని రాజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బేవార్స్ సినిమాలో కూతురి మీదున్న ప్రేమను తెలిపే ఓ పాట ఉంటుందని, ఆ పాట తనకు రియల్ లైఫ్‌లో కనెక్ట్ అయిందని తన కూతురి గురించి చెప్తూ రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు. కాగా 38 ఏళ్ల గాయత్రి అంత్యక్రియలు ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.