సూపర్‌స్టార్ రజినీకాంత్.. ఆయనకు ఉండే ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు!! ఫ్యాన్స్ లో కూడా ఎన్నో రకాల వాళ్ళుంటారు. రజినీకాంత్ ఏం చేస్తున్నారు ? ఎక్కడికి వెళ్తున్నారు ? ఎవరిని కలుస్తున్నారు ? ఏం మాట్లాడుతున్నారు ? అనేది సీరియస్ ఫ్యాన్స్ నిత్యం నిశితంగా గమనిస్తుంటారు.. రజినీకాంత్ లాంటి సెలబ్రిటీలకూ ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. అయినా హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఫాలోయింగ్ ను ఆపరు !! తాజాగా శనివారం ఉదయం 72 ఏళ్ళ రజినీకాంత్.. 52 ఏళ్ల వయసున్న ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాదాలకు గౌరవంగా నమస్కరించారు. దీన్ని కొందరు రజినీ ఫ్యాన్స్ మెచ్చుకోగా.. ఇంకొందరు జీర్ణించుకోలేకపోయారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే తత్వానికి రజినీయే నిలువెత్తు నిదర్శనమని పలువురు ఫ్యాన్స్ తమ ఫెవరేట్ హీరోను ఆకాశానికెత్తారు. తనకంటే చిన్నవాడైన యోగి కాళ్లను రజినీ మొక్కడం ఏంటి ? అని ఇంకొందరు అభిమానులు చర్చించుకుంటున్నారు.
కాళ్లకు మొక్కడం ఓ ట్రెండ్..
బడా లీడర్ల పాదాలకు విధేయతతో నమస్కరించే ట్రెండ్ చాలా దశాబ్దాల నుంచే తమిళనాడు పాలిటిక్స్ లో కొనసాగుతోంది. జయలలిత కనిపిస్తే సాష్టాంగ నమస్కారం చేయని అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే లేడు అని అంటారు. డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కూడా కరుణానిధి కాళ్లను పోటీపడి మరీ మొక్కేవారు. రజనీకాంత్ గతంలో ఎప్పుడూ ఇతరుల పాదాలకు నమస్కారం చేస్తూ మీడియా కంట పడలేదు. మరి ఇప్పుడు ఎందుకిలా యోగి ఆదిత్యనాధ్ కాళ్లకు నమస్కారం చేశారనేది తమకు అర్ధం కావడం లేదని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. అది రజినీ పర్సనల్ ఇష్యూ అని ఇంకొందరు చెబుతున్నారు.
యోగిలో రజినీని ఆకర్షించింది అదే..
రజనీకి దైవభక్తి ఎక్కువ. “జైలర్” మూవీ గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత కూడా ఆయన సంబరాల్లో పాల్గొనలేదు. నేరుగా హిమాలయాలకు వెళ్లారు. యోగులు, స్వాములకు ఆయనిచ్చే గౌరవం అంతటిది. సీఎం యోగి ఆదిత్యనాధ్ కూడా యోగుల కోవకు చెందిన వ్యక్తే. గతంలో గోరఖ్ పూర్ మఠం పీఠాధిపతిగా యోగి ఆదిత్యనాధ్ వ్యవహరించారు. అదే రజినీకాంత్ ను ఆకర్షించింది. అందుకే కాళ్లకు నమస్కరించారు. ఈ విషయంలో వయోబేధం లేదు. చినజీయర్ స్వామి కంటే వయసులో చాలా పెద్దవాళ్లు ఆయన కాళ్లకు మొక్కడం లేదా.. ఇది కూడా అలాంటిదే అని పలువురు నెటిజన్స్ రజనీకాంత్ ను సపోర్ట్ చేస్తున్నారు.