ఒకవైపు కోల్‌కతాలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో, ఉత్తరప్రదేశ్ లోని సోన్ భద్రలో 14 ఏళ్ల బాలిక తన ఉపాధ్యాయుడి చేతిలో అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. 8వ తరగతి చదువుతున్న బాధితురాలు సోన్‌భద్ర జిల్లాలోని దుద్ది గ్రామంలో నివాసం ఉంటోంది. వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ ఆసుపత్రిలో 20 రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం అర్థరాత్రి ప్రాణాలు కోల్పోగా నిందితుడు విశాంబర్ పరారీలో ఉన్నాడు.
బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పాఠశాలలో స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాడని, గతేడాది డిసెంబర్ 30న ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆమెను పిలిచాడని ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళి రేప్ చేసాడని పేర్కొన్నారు. పరువు పోతుందని ఆ బాలిక ఈ విషయం బయటకు చెప్పలేదని కాని… బాలిక ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో ఆమెను ఛత్తీస్గఢ్ బంధువుల ఇంటికి పంపి చికిత్స చేయించామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఇక తమను సైలెంట్ గా ఉండమని నిందితుడు 30 వేలు ఇచ్చినట్టు వాళ్ళు బయట పెట్టారు. అయితే బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె తండ్రి జూలై 10న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన విశాంబర్‌పై కేసు నమోదు చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు.