మరో 3 వికెట్లే… అశ్విన్ ను ఊరిస్తున్న రికార్డ్

బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ ముగిసిన మూడురోజుల్లోనే టీమిండియా మరో సిరీస్ కు రెడీ అవుతోంది. సొంతగడ్డపై న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ ఆడబోతోంది. ఇప్పటికే సీనియర్ ప్లేయర్స్ అందరూ ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు.

  • Written By:
  • Publish Date - October 14, 2024 / 06:28 PM IST

బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ ముగిసిన మూడురోజుల్లోనే టీమిండియా మరో సిరీస్ కు రెడీ అవుతోంది. సొంతగడ్డపై న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ ఆడబోతోంది. ఇప్పటికే సీనియర్ ప్లేయర్స్ అందరూ ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో భారత్ కు ఈ సిరీస్ కీలకమే. దీంతో కివీస్ పై సిరీస్ విజయమే లక్ష్యంగా రోహిత్ సేన కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ముంగిట స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచేందుకు కేవలం మూడడుగుల దూరంలో నిలిచాడు. ఈ సిరీస్ లో అశ్విన్ చరిత్ర సృష్టించడం ఖాయం. ప్రస్తుతం డబ్ల్యూటీసీ హిస్టరీలో నాథన్ ల్యాన్ 187 వికెట్లు తీస్తే…అశ్విన్ 185 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆసీస్ స్పిన్నర్ 43 మ్యాచ్ లలో ఈ ఘనత సాధిస్తే… అశ్విన్ 37 మ్యాచ్ లలోనే ఈ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు.

ఇటీవల బంగ్లాదేశ్ తో సిరీస్ లోనూ అశ్విన్ అదరగొట్టేశాడు. రెండు టెస్టుల సిరీస్ లో తన స్పిన్ మ్యాజిక్ చూపిన అశ్విన్ 11 వికెట్లు పడగొట్టి బూమ్రాతో సమంగా నిలిచాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డునూ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు బంగ్లాపై బ్యాట్ తోనూ మెరుపులు మెరిపించాడు. కీలక సమయంలో సెంచరీ చేయడం ద్వారా చెన్నై టెస్టులో జట్టును గెలిపించాడు. ఇప్పుడు న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ లోనూ అతని జోరు కొనసాగడం ఖాయం. ఎందుకంటే భారత్ తరపున టెస్టుల్లో కివీస్ పై అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ గా రికార్డు అశ్విన్ పేరిటే ఉంది. కివీస్ పై ఇప్పటి వరకూ 66 వికెట్లు తీశాడు.

ఇటీవల బంగ్లాపై అశ్విన్ చాలా రికార్డులు బ్రేక్ చేశాడు. అత్యధిక సార్లు ఐదు వికెట్లు ప్రదర్శన కనబరిచిన షేన్ వార్న్ రికార్డును బ్రేక్ చేసి రెండో స్థానంలో నిలిచాడు. కాగా 2023-25 డబ్ల్యూటీసీ సీజన్ లోనూ అశ్విన్ దే ఆధిపత్యం… ఇప్పటి వరకూ 10 మ్యాచ్ లలో 53 వికెట్లు పడగొట్టాడు. ఇక భారత్ గడ్డపై సిరీస్ గెలవాలనుకుంటున్న కివీస్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. ఎందుకంటే అశ్విన్, జడేజా స్పిన్ ను ఎదుర్కోవడం కివీస్ కు సవాలే. చివరిసారిగా 2021లో భారత్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ అప్పుడు 1-0తో సిరీస్ ను కోల్పోయింది. ఈ సారి కూడా కివీస్ తో పోలిస్తే టీమిండియానే బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో వారికి ఓటమి తప్పదని అంచనా వేస్తున్నారు.