భారతదేశంలో అతి పెద్ద రవాణా నెట్వర్క్ గా రైల్వేని చెబుతూ ఉంటారు. కోట్లలో ప్రయాణికులు నిత్యం ప్రయాణాలు చేస్తూ ఉంటారు. లక్షల సంఖ్యలో సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. కొన్ని వేల స్టేషన్ల మీదుగా ప్రజా రవాణాను అందిస్తుంది రైల్వే శాఖ. అలాంటి రైల్వేశాఖ నిన్న జొమాటోతో భాగస్వామ్యం అయిందన్న విషయం ఆనందాన్ని నింపింది. దీనికి ప్రదాన కారణం ప్రయాణీకులకు మరింత రుచికరమైన ఆహారాన్ని అందించడమే. అయితే ఈ ఆనందాన్ని ఎంతో సేపు ఉంచలేకపోయారు ప్యాంట్రీ యాజమాన్యం. దీనికి కారణం రైల్వే కిచెన్లో ఎలుకలు సంచరించడమే. అది కూడా ఏసీ రైల్ కోచ్ లో ఇలాంటి పరిస్థితి తలెత్తడం ముక్కున వేలేసుకునేలా చేసింది.
అసలే ఆలస్యం.. ఆపై అపరిశుభ్రత
రైల్వేలో సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో రుచి, శుచితో కూడిన ఆహారం అందుబాటులో ఉండదు. కేవలం కడుపు నింపుకోవడం కోసం గద్యంతరం లేకుండా వీటిని తినాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల నడుమ ఎలుకలు రైల్వే కిచెన్లో సంచరిస్తూ.. అక్కడి ఆహారపదార్థాలను తింటూ కనిపిస్తే ఇక ఆ భావన చెప్పేందుకు వీలుపడదు. తాజాగా ఈ ఘటన 11099 నంబర్ గల మడ్గావ్ ఎక్స్ ప్రెస్ లో చోటు చేసుకుంది. ఈ రైలు సాధారణంగా లోకమాన్యతిలక్ స్టేషన్ నుంచి 1.45 గంటలకు బయలుదేరాలి. అయితే గంటన్నర ఆలస్యంగా 3.30 కి ప్లాట్ ఫాం పైకి వచ్చింది. అసలే సమయానికి రైలు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురౌతున్న సమయంలో.. రైలు వెనుక భాగంలో వెళ్లి చూస్తే ప్యాంట్రీ కార్లో ఎలుకలు సంచరిస్తూ కనిపించాయి. దీనిని గుర్తించిన ప్యాసింజర్ ఆ దృశ్యాలను వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేశారు.
అధికారుల నిర్లక్ష్య సమాధానం..
ఈ ఘటనపై ముందుగా ఆర్పీఎఫ్ పోలీసులకు తెలిపారు. దీనిపై తగు చర్యలు తీసుకోకపోగా రైల్వే ట్రాక్ పై సంచరిస్తున్న ఎలుక లోపలికి దూరినట్లుందని నిర్లక్ష్యంగా బదులిచ్చారు. దీంతో ఆయనకు కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తరువాత అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ మీనా అనే ఆవిడకు ఫిర్యాదు చేశారు. ఆమె ప్యాంట్రీ మేనేజర్ తో మాట్లాడమని వెళ్లిపోయారు. చివరకు ప్యాంట్రీ మేనేజర్ కు ఈ విషయం తెలిపాడు ప్రయాణీకుడు. రైలు కోచ్ లోని కొన్ని లోపాల కారణంగా ఎలుకలు లోపలికి ప్రవేశించినట్లు తెలిపారు ప్యాంట్రీ మేనేజర్. దీనిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో రైల్వే ఉన్నతాధికారులు స్పందించారు. ఈ సమస్యపై తగు నివారణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్యాంట్రీలో జరిగిన ఘటనకు చింతిస్తున్నామని, శుభ్రతపై తగు జాగ్రత్తలు తీసుకుంటామని ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు.
ప్రయాణీకుల ఆవేదన..
అసలే ఆధునిక రైళ్లను ట్రాక్ పైకి తీసుకొస్తున్న రైల్వే శాఖ.. ఉన్న రైళ్ళపై అశ్రద్ద వహిస్తుందని చెప్పకతప్పడం లేదు. దీనికి ఈ ఘటనే నిలువెత్తు సాక్ష‌్యం. అసలే అనారోగ్య సమస్యలతో రైలు ప్రయాణం సుఖవంతం అని దీనిని ఎంచుకుంటారు ప్రయాణీకులు. అలాంటి వారికి ఇలా అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన భోజనం తినడం వల్ల కలిగే సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తున్నారు. వందే భారత్, స్వచ్ఛ భారత్ పేర్లతో తెగ ఊదరగొడుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ ఘటనను చాలా లైట్ గా తీసుకోవడం పట్ల ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. ఉన్న వాటిని సక్రమంగా ఉంచండి. ఆ తరువాత సరికొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు కృషి చేద్దురు అంటూ విమర్శిస్తున్నారు. అలాగే మీ పరిధిలోని శాఖలను స్వచ్ఛంగా ఉంచుకోండి ఆ తరువాత భారతదేశాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దుదురు అని తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.
Do Watch…
To provide hygienic & tasty food to passengers & to monitor Quality Control #IndianRailways have appointed 🐭Food Tasters 🐀🐁inside Pantry Cars.
Pilot project inside Pantry Car of 11009 LTT Madgaon Express on 14th Oct 2023. pic.twitter.com/xM7m2330uS
— मुंबई Matters™ (@mumbaimatterz) October 18, 2023
T.V.SRIKAR