PAYTM: భారీగా పతనమైన పేటీఎం షేర్లు.. రెండు రోజుల్లోనే 40 శాతం పతనం..

బుధవారం పేటీఎం షేరు ధర 761 రూపాయలు. ఇప్పుడు దాని ధర రూ. 487 రూపాయలు. ఈ ఒక్క లెక్క చెబుతోంది పేటీఎం షేర్లు ఏ రేంజ్‌లో పడిపోయాయో చెప్పడానికి. కేవలం రెండంటే రెండు రోజుల్లో ఏకంగా 40శాతం పతనమయ్యాయంటే ఏ స్థాయిలో అమ్మకాల ఒత్తిడి ఉందో అర్థమవుతుంది.

  • Written By:
  • Publish Date - February 2, 2024 / 08:48 PM IST

PAYTM: పేటీఎం షేరు మదుపరులకు చుక్కలు చూపిస్తోంది. రెండ్రోజుల నుంచి షేరు ఏకంగా 40శాతం పతనమైంది. RBI నిర్ణయంతో పేటీఎం షేర్లు బేర్‌మన్నాయి. ఎప్పుడు కోలుకుంటుందో తెలియక మదుపరులు గొల్లుమంటున్నారు. అసలు పేటీఎం షేరు ఎందుకింత పడిపోతోంది..? దీనికి కారణం ఎవరు..? జనవరి 31న అంటే బుధవారం పేటీఎం షేరు ధర 761 రూపాయలు. ఇప్పుడు దాని ధర రూ. 487 రూపాయలు. ఈ ఒక్క లెక్క చెబుతోంది పేటీఎం షేర్లు ఏ రేంజ్‌లో పడిపోయాయో చెప్పడానికి. కేవలం రెండంటే రెండు రోజుల్లో ఏకంగా 40శాతం పతనమయ్యాయంటే ఏ స్థాయిలో అమ్మకాల ఒత్తిడి ఉందో అర్థమవుతుంది. శుక్రవారం ఏకంగా 121 రూపాయలు పడిపోయి లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. లోయర్‌ సర్క్యూట్‌ కనుక లేకపోతే షేరు ధర ఇంకా పడిపోయి ఉండేది.

REVANTH REDDY: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ముందా..? కేసీఆర్ మళ్లీ సీఎం కాలేరు: రేవంత్ రెడ్డి
ఆర్‌బీఐ నిర్ణయం పేటీఎం షేర్ల పతనానికి కారణమైంది. జనవరి 31న పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ పరిమితుల వేటు వేసింది. ఈనెల 29 తర్వాత కొత్త డిపాజిట్లు తీసుకోకుండా, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌, NCMC కార్డ్‌ వంటివి టాప్‌ అప్‌ చేయకుండా ఆంక్షలు విధించింది. దీంతో మార్కెట్లలో షేర్ల పతనం ప్రారంభమైంది. పరిస్థితిని సమీక్షిస్తున్నామంటూ కంపెనీ ఫౌండర్ విజయ్‌ శేఖర్‌ శర్మ చెప్పిన రొటీన్‌ డైలాగ్‌లు పతనానికి అడ్డుకట్ట వేయలేకపోయాయి. నిజానికి తెలివైన మదుపరులు మొదటి నుంచి ఈ షేరుపై పెద్దగా ఆసక్తి చూపలేదు.  కంపెనీని ఓవర్‌ వాల్యూయేషన్‌ చేశారన్న ఆరోపణలతో వారు జాగ్రత్తగా వ్యవహరించారు. అయితే కంపెనీ మాతృసంస్థ వన్‌ నైంటీ సెవన్ కమ్యూనికేషన్స్ మాత్రం రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగవుతుందని చెబుతూ వచ్చింది. 2022లో కొంత కోలుకున్నట్లు కనిపించినా అది కొంతకాలమే.. పేటీఎం వ్యవహారాలపై ఆర్‌బీఐ హెచ్చరికలు చేస్తూ వస్తున్నా పెడచెవిన పెట్టింది ఆ సంస్థ.

ఆ సంస్థ దారికి రాకపోవడంతో కఠిన చర్యలు తప్పలేదు. దాని ఫలితమే ఈ పతనం. మొదటి నుంచి కూడా పేటీఎం షేర్లు కొన్న ఇన్వెస్టర్లు లబోదిబోమంటూనే ఉన్నారు. ఏ రోజు కూడా షేరు తన ఇష్యూ ధరను తాకలేదు. ఈ షేరు రాకెట్‌లా దూసుకెళ్లి ఆకాశాన్ని తాకుతుందని పెట్టుబడిదారులు భావిస్తే.. అందుకు భిన్నంగా కుప్పకూలి పాతాళం దారి చూస్తోంది. 2021 నవంబర్‌లో పేటీఎం ఇష్యూ ధర 2వేల 150 రూపాయలు. మార్కెట్‌లో 9శాతం డిస్కౌంట్‌తో 19వందల 50కి లిస్టైంది. ఇప్పుడు దాని ధర 487 రూపాయలు. అంటే ఇష్యూ ధరతో పోల్చితే కేవలం 22శాతం పెట్టుబడి మాత్రమే మిగిలిందన్నమాట. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అప్పుడు మీరు లక్ష రూపాయలు పెట్టి పేటీఎం షేర్లు కొని ఉంటే ఇప్పుడు మిగిలింది కాస్త అటూ ఇటుగా 22వేలే.

Chalamalasetty Sunil: కాకినాడ ఎంపీ కోసం నాలుగోసారి చలమలశెట్టి సునీల్.. ఇప్పుడైనా ఐరన్ లెగ్ ముద్ర పోతుందా?

అసలు ఆ షేరును అయినకాడికి అమ్ముకుందామనుకుంటున్న వారే కానీ ధైర్యం చేసి కొనేవారే లేరు. ఈ షేరు ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. రేటింగ్ సంస్థలు న్యూట్రల్‌ రేటింగ్ ఇస్తున్నాయి. ఐపీఓకు వెళ్లిన సమయంలో మార్కెట్‌ వాల్యూ లక్ష కోట్లు అయితే ఇప్పుడు 30వేల కోట్లకు పడిపోయింది. పేటీఎం సామాన్యులనే కాదు వ్యాపార దిగ్గజాలను కూడా ముంచేసింది. మార్కెట్లను శాసించే వారెన్‌ బఫెట్‌ లాంటి దిగ్గజాలు కూడా పేటీఎం బాధితులే.. ఆయనకు చెందిన బెర్క్‌షైర్‌ హాతావే సంస్థ 2018లో దాదాపు 2వేల 2వందల కోట్లతో పెట్టుబడులు పెట్టారు. లిస్టింగ్ సమయంలో కొంత, గతేడాది చివర్లో మిగిలిన మొత్తాన్ని అమ్మేసారు. మొత్తంగా బఫెట్‌కు పేటీఎం వల్ల 507 కోట్ల నష్టం వాటిల్లింది. ఇకపై షేరు పెరగడం దాదాపు అసాధ్యం అని భావించిన ఆ సంస్థ అయినకాడికి అమ్మేసుకుంది. బఫెట్‌ వంటి బిగ్‌షార్క్‌కు అది చిన్న మొత్తమే అయినా ఆయన ఎగ్జిట్‌ అవడం మదుపరులు సెంటిమెంట్‌ను పడగొట్టింది.