Bank License: ఈ రెండు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ.. మరి ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?

బ్యాంకులు అంటేనే పొదుపు సంస్థలు అని పేరు. ఇంట్లో ఉన్న నగ, నగదు రెండింటినీ బ్యాంకు ఖాతా తెరచి అందులో భద్రపరుచుకుంటాము. అలాంటిది బ్యాంకులకే సెక్యూరిటీ లేందంటే.. చాలా కొత్తగా ఉంది కదూ. అవును తాజాగా మనదేశంలో ఆర్బీఐ ఇలాంటి బ్యాంకులను రెండింటిని గుర్తించింది. వాటి లైసెన్స్ లను రద్దు చేసింది. ఎందుకు ఈ బ్యాంకులను రద్దు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - July 7, 2023 / 04:05 PM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలకు చెందిన బ్యాంకులను హోల్డ్ లో ఉంచింది. ఈ బ్యాంకుల్లోని ఖాతాల ద్వారా జరిగే లావాదేవీలు నిలిపివేసింది. అందులో మెదటిది మహారాష్ట్ర బుల్ధానా ప్రాంతాని చెందిన మల్కాపుర్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కాగా.. రెండవది కర్ణాటలో బెంగళూరు కేంద్రంగా పనిచేసే శుష్రుతి సౌహార్ద సహకార బ్యాంకులుగా పేర్కొంది. ఈ బ్యాంకుల ఆడిట్ వివరాల ప్రకారం సరైన నగదు నిలువలు, మూలధనం లేవని గుర్తించింది. అందుకే బుధవారం వీటి లైసెన్స్ లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకులకు భవిష్యత్తులో లాభాలు కూడా వచ్చే పరిస్థితి లేదని అలాగే ఖాతాదారుల లావాదేవీలు కూడా ఆశించినంతమేర జరగడం లేదని తెలిపింది. ఇంకా చెప్పాలంటే ఈ బ్యాంకులో డిపాజిట్ చేసిన డిపాజిటర్లు తమ నగదును ఉపసంహరించుకుంటాం అంటే పూర్తి స్థాయిలో వీరికి డబ్బులు ఇవ్వలేని స్థితికి దిగజారీపోయింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ బ్యాంకులో నగదు నిలువలు ఏమేర అడుగంటాయో.

ఇక డిపాజిటర్ల పరిస్థితికి వస్తే.. మీ నగదుకు ఎలాంటి డోకా లేదని స్పష్టం చేసింది ఆర్బీఐ. ఈ ఇరు బ్యాంకుల లైసెన్స్ రద్దు అయినప్పటికీ డిఐసిజిసి ద్వారా నగదు పొందవచ్చు. అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ద్వారా రూ. 5 లక్షల వరకూ ఇన్సురెన్స్ లభిస్తుందని తెలిపింది. ఈ ఆప్షన్ ను ఉపయోగించుకొని తమ నగదును క్లైం చేసుకోవచ్చని వివరించింది. ఈ బ్యాంకుల్లోని ఖాతాదారలు వివరాల్లోకి వెళితే చాలా తక్కువ స్థాయిలోనే అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. డిఐసీజీసీ తెలిపిన దాని ప్రకారం మహారాష్ట్ర మల్కాపుర్ బ్యాంకులో 97.60 శాతం మంది.. కర్ణాటక శుష్రుతి బ్యాంకులో 91.92 శాతం మంది డిపాజిటర్లు తమ డబ్బలు తిరిగి పొందేందుకు అర్హులుగా ప్రకటించింది.

T.V.SRIKAR