ఐపీఎల్ వచ్చిన ప్రతీసారీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై భారీ అంచనాలు ఉంటాయి. అయితే గ్రౌండ్ లోకి వచ్చేటప్పటికి మాత్రం ఆర్సీబీ ఫ్లాప్ షో కొన్నేళ్ళుగా కొనసాగుతూనే ఉంది. ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ జట్టులో ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. ఈ సాలా కప్ నమదే అంటూ బరిలోకి దిగినా టైటిల్ కల మాత్రం నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో మెగావేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రిటెన్షన్ జాబితాలో విరాట్ కోహ్లీ ఒక్కడికే చోటు దక్కినట్టు…. మిగిలిన స్టార్ ప్లేయర్స్ అందరినీ వేలంలోకి వదిలేస్తున్నట్టు సమాచారం. కోహ్లీని రిటైన్ చేసుకోవడం ఖాయమని అందరికీ తెలుసు… అయితే మిగిలిన స్టార్ ప్లేయర్స్ లో చాలా మందికి ఎక్కువ మొత్తం చెల్లించామన్న భావనలో ఆర్సీబీ యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే వారిని వేలంలోకి వదిలేసి సాధ్యమైనంత తక్కువ ధరకే సొంతం చేసుకోవాలని భావిస్తోంది.
బెంగళూరు వదులుకునే జాబితాలో ఇద్దరు టీమిండియా ప్లేయర్లు, మరో ముగ్గురు విదేశీ క్రికెటర్లు ఉన్నారని సమాచారం. ఈ లిస్ట్‌లో మహ్మద్ సిరాజ్ పేరు కూడా ఉందన్న వార్త అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. 2018 నుంచి సిరాజ్ ఆర్‌సీబీ తరఫున ఆడుతోన్నాడు. ప్రతి ఏటా ఆర్‌సీబీ సిరాజ్ కు 14 కోట్లు చెల్లిస్తోంది. గత కొన్ని సీజన్లుగా సిరాజ్ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతుండడంతో టీమ్ నుంచి రిలీజ్ చేయాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. సిరాజ్‌తో పాటు మరో టీమిండియా ప్లేయర్ రజత్ పాటిదార్‌ను కూడా ఆర్‌సీబీ వదులుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రజత్ పాటిదార్‌ను 11 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ వేలంలోకి వదిలేసి తక్కువ మొత్తానికే దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది. అలాగే ఆస్ట్రేలియన్ క్రికెటర్ కామెరూన్ గ్రీన్‌ను 14 కోట్లకు కొన్నప్పటకీ దానికి అతను న్యాయం చేయలేకపోయాడు.దీంతో గ్రీన్ ను రిటైన్ లిస్ట్ నుంచి తప్పించినట్లు సమాచారం. ఈ వ్యూహం సక్సెస్ అయితే ఆర్సీబీకి కోట్ల రూపాయలు మిగిలినట్టే.. వీటితో మరికొందరు టాలెంటెడ్ యంగస్టర్స్ ను కొనుగోలు చేయొచ్చు.
ముందు నుంచీ ఊహిస్తున్నట్టుగానే ఆస్ట్రేలియన్ హిట్టర్ మాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ వదిలేయడం ఖాయమైంది. గత సీజన్‌లో మాక్స్‌వెల్ దారుణంగా ఫ్లాప్ అయ్యాడు. అలాగే వయసును దృష్టిలో ఉంచుకుని కెప్టెన్ డుప్లెసిస్ ను సైతం బెంగళూరు వదిలేయనుంది. కాగా రిలైన్ లిస్ట్‌లో విరాట్ కోహ్లి పేరు ఒక్కటే ప్రస్తుతానికి ఖాయమైంది. మరి మిగిలిన ఐదుగురు ఎవరా అనేది మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశముంది.