ఆటో మొబైల్ రంగంలో ఎన్నో విజయాలను సాధించిన వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు నానో కారు మాత్రం ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. మిడిల్ క్లాస్ కుటుంబాలు ఎక్కువగా ఉండే భారత్ లాంటి దేశంలో వారికి కారు అనేది ఓ కల. కారు కొనాలంటే 5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు పెట్టాలి. అలాంటి మిడిల్ క్లాస్ కోసం లక్ష రూపాయలకే కారు తీసుకొస్తే…? ప్రపంచంలోనే అత్యంత కారు చౌకగా కారుని మిడిల్ క్లాస్ కు అందిస్తే…? ఆ ఊహే ఎంతో బాగుంది కదా…? నానో కారు విషయంలో అలానే రతన్ టాటా ఎన్నో కలలు కన్నారు.
తనను ఇంతటి వాడ్ని చేసిన దేశ ప్రజలకు లక్ష రూపాయలకే ఓ కారు అందించాలి అనుకున్నా… అంతర్గత పోరుతో నానో కారు ప్రాజెక్ట్ అర్ధంతరంగా ఆగిపోయింది. ఈ కారును 2008లో మార్కెట్‌లోకి కేవలం రూ. లక్షకే అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రపంచంలోనే చౌకైన కారుగా రతన్ టాటా స్వయంగా ప్రకటించారు. కారు అంటే డబ్బున్న వాళ్ళ వాహనం అనే మాటను తొలగించారు. కారు బయటకు వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. కేవలం నలుగురు మాత్రమే ప్రయాణించేలా ఓ బుల్లి కారుని అద్భుతంగా తయారు చేసారు.
కాని క్రమంగా నానో కారు ఆగిపోయింది. దానికి కారణం టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ. తాను పట్టుబట్టి టాటా సన్స్ బాధ్యతలను సైరస్ మిస్త్రీకి అప్పగించారు రతన్ టాటా. కాని సైరస్ మిస్త్రీ మాత్రం నానో కారు విషయంలోనే రతన్ టాటాను ఇబ్బంది పెట్టారు. టాటా కలల ప్రాజెక్ట్… టాటా కంపెనీకి భారంగా మారిందని, దాని వలన లాభాలు రావడం లేదని, ఆర్థికంగా కంపెనీకి గుది బండలా మారిందని ‘నానో’ కారు ప్రాజెక్టు ఆపేయాలని మిస్త్రీ ఎన్నో ప్రయత్నాలు చేసారు. ఇందుకోసం కంపెనీ ఉద్యోగులతో రహస్యంగా సమావేశాలు నిర్వహించారని ఆరోపణ కూడా ఉంది.
ఎలాంటి పరిస్థితిలో కూడా నానో కారు ఆపవద్దని రతన్ టాటా పట్టుదలగా వ్యవహరించినా అనేక కారణాలతో నానో కారు తయారి ఆగిపోయింది. మిస్త్రీకి రతన్ టాటాకు మధ్య విభేదాలు అక్కడే మొదలయ్యాయి. ఈ వ్యవహారం కోర్ట్ మెట్లు కూడా ఎక్కింది. చివరకు మిస్త్రీ… టాటాను వదిలేసారు. ఇప్పుడు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. చంద్రశేఖరన్ సమర్ధతను గుర్తించిన టాటా… తొలిసారి పార్సీయేతర వ్యక్తికి టాటా బాధ్యతలు అప్పగించారు. టాటాను సమర్ధవంతంగా నడపడంలో చంద్రశేఖరన్ విజయం సాధించారు.