Call Recordings: ఫోన్ కాల్ రికార్డింగ్ పై హైకోర్టు సంచలన తీర్పు.. గోప్యత హక్కు భంగపరచడమేనని స్పష్టం

మనం సాధారణంగా ఇతరులతో సంభాషించేటప్పుడు అవతలి వ్యక్తికి తెలియకుండా ఫోన్ కాల్స్ రికార్డ్ చేస్తూ ఉంటాం. అది చట్టపరమైన తప్పిదంగా కోర్టు భావిస్తోంది. తాజాగా ఒక కేసులో సంచలన తీర్పును కూడా వెలువరించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - October 16, 2023 / 08:27 AM IST

రాజ్యాంగంలోని అధికరణం 21 ప్రకారం ఇతరులకు తెలియకుండా కాల్ రికార్డ్ చేయడం, అతని పర్సనల్ విషయాలను తెలుసుకోవడం గోప్యత హక్కు ఉల్లంఘన కిందకు వస్తుందని ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2019లో పెండింగ్లో ఉన్న నిర్వహణ ఖర్చుల అంశంపై వాదలను విన్న ధర్మాసనం గతంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఓ వివాహిత వేసిన కౌంటర్ ఫిటిషన్ ఆధారంగా ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

ఫ్యామిలీ కోర్టు తీర్పు పై హైకోర్టులో సవాల్..

ఛత్తీస్గఢ్ లోని మహాసముంద్ జిల్లాకు చెందిన ఒక మహిళ కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లు సాఫీగా సాగిన సంసారంలో అనుమానాలు వచ్చాయి. దీనికి కారణం భార్య ఎవరితోనో తనకు తెలియకుండా మాట్లాడుతోంది అన్న విషయం పై విడాకులు కోరాడు భర్త. దీనికి సంబంధించి ముందుగా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సాక్ష్యంగా ఆమె ఇతరులతో మాట్లాడిన మాటలను ఫోనులో రికార్డింగ్ చేశారు. దీనికి కారణం ఆమె ఇతరులతో మాట్లాడినట్లు నేరం రుజువైతే నిర్వహణ ఖర్చులు ఇవ్వనవసరం లేదనే ఉద్దేశ్యంతో ఈ చర్యకు పాల్పడ్డాడు. ఫ్యామిలీ కోర్టులో భర్తకు తీర్పు అనుకూలంగా వచ్చింది. ఫ్యామిలీ కోర్టులో వచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో భార్య తరఫు న్యాయవాదులు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలని జడ్జిని కోరారు.

స్త్రీ గోప్యతకు భంగం..

మహిళా గోప్యత హక్కుకు భంగం కలిగించేలా ఆమె భర్త కాల్ రికార్డిండ్ చేశారని భార్య తరఫు న్యాయవాది వైభవ్ ఎ. గోవర్థన్ వాదించారు. దీనికి సంబంధించి గతంలో మధ్యప్రదేశ్ హై కోర్టు సహా సుప్రీం కోర్టు  ఇచ్చిన తీర్పులను ఉదహరించారు. ఈ వాదనలు విన్న ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తి ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేశారు. స్త్రీ స్వేచ్ఛను, గోప్యతను భంగపరిచే ఈ పిటిషన్ ను అనుమతించడం ద్వారా ఫ్యామిలీ కోర్టు చట్టపరమైన తప్పిదం చేసిందని తీర్పు వెలువరించారు జస్టిస్ రాకేశ్ మోహన్ పాండే. ఫోన్ రికార్డింగ్ ఆధారంగా భర్త పిటిషన్ ను తీసుకోవడాన్ని న్యాయస్థానం అనుమతించదని స్పష్టం చేశారు.

T.V.SRIKAR