REDDY CONGRESS : తెలంగాణలో మళ్ళీ రెడ్డి కాంగ్రెస్.. ఏడుగురు రెడ్లకు లోక్ సభ సీట్లు

తెలంగాణ (Telangana)లో కులగణన చేస్తాం... బీసీ (BC) లకు రాజ్యాధికారం కల్పిస్తామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దగ్గర నుంచి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దాకా అందరూ అంటున్నారు.

 

తెలంగాణ (Telangana)లో కులగణన చేస్తాం… బీసీ (BC) లకు రాజ్యాధికారం కల్పిస్తామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దగ్గర నుంచి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దాకా అందరూ అంటున్నారు. కానీ ఆచరణలో ఏం జరుగుతుందో… కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్లు ఇచ్చిన విధానం చూస్తే తెలుస్తుంది. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉంటే… అందులో మేజర్ షేర్… రెడ్డి సామాజికవర్గానికే వెళ్ళింది. ఏడుగురు రెడ్లకు ఎంపీ టిక్కెట్లు ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం.

తెలంగాణలో బీసీలు ఎక్కువ. 52శాతం మంది దాకా బీసీ వర్గం ఉంటుంది. కానీ వాళ్ళకి అడుగడుగునా అన్యాయం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ వచ్చాక… బీసీలకు ప్రియారిటీ ఇస్తామని చెప్పినా… అది భ్రమ అని మరోసారి బయటపడింది. 17 ఎంపీ సీట్లల్లో మూడు టిక్కెట్లు మాత్రమే బీసీలకు దక్కాయి. మొత్తం ఓసీలకు 9 సీట్లు ఇవ్వగా… ఇందులో ఏడుగురు రెడ్లు, ఒకరు వెలమ, మరొకరు ముస్లిం. ఎస్సీల్లో మాలలకు 2 టిక్కెట్లు ఇవ్వగా… మాదిగకు నో ఛాన్స్. ఎస్టీల్లో ఆదివాసీ, లంబాడాకు చెరో సీటు ఇచ్చింది కాంగ్రెస్.

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చామల కిరణ్ రెడ్డి (Chamala Kiran Reddy), రఘువీర్ రెడ్డి (Raghuveer Reddy), పట్నం సునీత (Patnam Sunitha), రంజిత్ రెడ్డి, జీవన్ రెడ్డి, రఘురామ రెడ్డి, వంశీచందర్ రెడ్డికి టిక్కెట్లు ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. రాజేందర్ రావు వెలమ, వలియుల్లా సమీర్ ముస్లిం. బీసీల్లో మున్నూరు కాపు వర్గానికి చెందిన దానం నాగేందర్, ముదిరాజ్ వర్గం నేత నీలం మధు, లింగాయత్ కి చెందిన సురేశ్ షెట్కార్ కి టిక్కెట్లు ఇచ్చింది. ఎస్టీ రిజర్వ్ సీట్లల్లో ఆత్రం సుగుణ ఆదివాసీ, బలరాం నాయక్… లంబాడా వర్గానికి చెందినవారు. తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వుడ్ లోక్ సభ సీట్లు ఉంటే…బైండ్ల వర్గానికి చెందిన కడియం కావ్యకు, మల్లు రవి, గడ్డం వంశీ మాలల కేటగిరి అభ్యర్థులకు కేటాయించారు. మాదిగలకు ఈసారి కాంగ్రెస్ లో నో ఛాన్స్.

అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ లోనూ రెడ్డి వర్గానిదే పై చేయి… 12 మంది మంత్రుల్లో సీఎం రేవంత్ రెడ్డి సహా నలుగురు రెడ్లకు బెర్త్ దక్కింది. ఇక్కడా ఇద్దరు బీసీలకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చింది కాంగ్రెస్. అసలు ఈసారి తెలంగాణ కాంగ్రెస్ లో గెలిచిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది రెడ్డి వర్గం వారే ఉన్నారు. ఎక్కువ టికెట్లు రెడ్లకు ఇవ్వడంతో.. వాళ్ళే ఎక్కువ మంది గెలిచారు. ఈ వర్గం వాళ్ళు మొత్తం గెలిచిన ఎమ్మెల్యేల్లో 45 శాతానికి పైగా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కి ముందు సీఎం రేవంత్ రెడ్డి హడావిడిగా ప్రకటించిన కార్పొరేషన్ పదవుల్లోనూ రెడ్డి వర్గానికి ప్రాధాన్యత దక్కినట్టు ఆరోపణలొచ్చాయి. తెలంగాణలో బీసీలు 52 శాతం మంది ఉన్నందున… ఇక నుంచైనా ఆ వర్గానికి ప్రాధాన్య ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ నేతల్లో వస్తోంది.