సొంతగడ్డపై భారత్ కు ఊహించని పరాజయం… బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ టీమిండియాకు షాకిచ్చింది. బ్యాటర్ల వైఫల్యంతో ఓటమి పాలైన భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతున్న గెలుపు శాతం తగ్గింది. ఈ ఒక్క ఓటమితో ఏకంగా ఆరు శాతం తగ్గి 68.06 పర్సంటేజీతో కొనసాగుతోంది. ఈ సీజన్ లో టీమిండియా ఇప్పటి వరకూ 12 టెస్టులు ఆడి 8 విజయాలు, 3 ఓటములు, ఒక డ్రా చేసుకుంది. కాగా ఇతర జట్ల సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే తదుపరి 7 టెస్ట్‌ల్లో టీమిండియా 4 మ్యాచ్‌లు గెలవడంతో పాటు ఒక మ్యాచ్ డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌లు ఆడనున్న టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మరో 5 టెస్ట్‌లు ఆడనుంది. అయితే న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి ఉంటే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారయ్యేది.
కానీ ఈ సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. న్యూజిలాండ్‌తో తదుపరి రెండు టెస్ట్‌లు గెలవడంతో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరో రెండు టెస్ట్‌లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా మరో మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలి. నాలుగు మ్యాచ్ లు గెలిస్తే ఫైనల్స్ బెర్త్ దాదాపు ఖాయం అవుతుంది. మూడు టెస్టుల్లో గెలిచిన పక్షంలో.. భారత్ ఫైనల్స్ కు చేరాలంటే వేరే జట్టు గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది. ఈ సమీకరణం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే మరో బెర్త్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 62.5 శాతంతో రెండో స్థానంలోనూ, శ్రీలంక 55.66 శాతంతో మూడో స్థానంలోనూ కొనసాగుతున్నాయి.
తాజాగా బెంగళూరు టెస్టులో భారత్ ను ఓడించిన న్యూజిలాండ్ అనూహ్యంగా పైకి దూసుకొచ్చింది. ఏడో స్థానం నుంచి ఏకంగా నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 9 టెస్టుల్లో 4 విజయాలు, 5 ఓటములతో కలిపి 44.44 గెలుపు శాతంతో నాలుగో స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ రేసులో కివీస్ ముందంజ వేయాలంటే భారత్ పై సిరీస్ గెలవాల్సి ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ 43.06 శాతం, సౌతాఫ్రికా 38.89 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రెండో బెర్త్ కోసం ఆసీస్, కివీస్, శ్రీలంక జట్ల మధ్య గట్టిపోటీ ఉండబోతోంది. అదే సమయంలో భారత్ జట్టు ఇకపై ధీమాగా ఉండలేని పరిస్థితి నెలకొంది. మిగిలిన ఏడు టెస్టుల్లో రెండు సొంతగడ్డపై జరగనుండడం ఒక్కటే అడ్వాంటేజ్. పుణే, ముంబై వేదికలుగా న్యూజిలాండ్ తో జరిగే మిగిలిన రెండు టెస్టుల్లో గెలిస్తే భారత్ WTC ఫైనల్ రేసులో మరింత ముందుకెళ్ళినట్టే.