గత నాలుగున్నరేళ్ళుగా వికేంద్రీకరణ మంత్రాన్ని జపిస్తోంది అధికార వైసీపీ. ఇందులో భాగంగా విశాఖను పరిపాలనా రాజధానిగా చేసేందుకు కార్యాచరణ రూపొందించారు అధికారులు. ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయానికి సంబంధించిన పనులు పూర్తి అయ్యాయి. ఉన్నతాధికారుల భవనాలను వెతికేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించారు. వీరు విశాఖ మొత్తం పర్యటించి అనుకూలమైన ప్రాంతాలను, భవనాలను గుర్తించారు. అక్కడి పరిస్థితులను నేడు సీఎం జగన్ కు వివరించనున్నారు.
ఉన్నతాధికారులతో పాటూ, త్రిమన్ కమిటీ అధికారులు సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగనుంది. దసరాకే విశాఖకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ పెయింటింగ్ పనుల జాప్యం వల్ల వాయిదా పడింది. అతి త్వరలో విశాఖ వేదికగా పాలనను సాగించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు ఉన్నతాధికారులు. ముఖ్యమంత్రి, మంత్రులతో సహా ఆయా శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలు విశాఖలో మకాం మార్చాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పనులు ఎక్కడి వరకూ వచ్చాయి అనే అంశాన్ని కమిటీ సభ్యులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకోనున్నారు. ఈ సమీక్షా సమావేశం తరువాత ఎప్పుటి నుంచి పాలన సాగిస్తారన్నదానిపై స్పష్టత రానుంది.
T.V.SRIKAR