ప్రతీ టీమ్ లో స్టార్ బ్యాటర్లను ఔట్ చేసేందుకు వారి వీక్ నెస్ పై ప్రత్యర్థి బౌలర్లు బాగా ఫోకస్ పెడతారు… ముఖ్యంగా చాలా మంది బ్యాటర్లు ఆఫ్ స్టంప్ మీద పడుతున్న బంతిని ఆడేందుకు ప్రయత్నిస్తూ వికెట్లు పారేసుకుంటారు. ఈ బలహీనత భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి కూడా ఉంది.. ఆ మధ్యలో దీని నుంచి బయటపడ్డాడని అనుకున్నా… ప్రస్తుతం ఆసీస్ టూర్ లో ఇవే బాల్స్ కు ఔట్ అవుతున్నాడు. ఆఫ్ స్టంప్ మీద పడిన బంతిని వెంటాడుతూ వికెట్ల వెనకే క్యాచ్ ఔటవుతున్నాడు. ఆసీస్ గడ్డపై తిరుగులేని రికార్డు ఉన్న కోహ్లీ.. ఆ బలహీనతను అధిగమించి మునుపటి ఫామ్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కోహ్లీకి కీలక సలహా ఇచ్చాడు. 2003-04 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అడిలైడ్ వేదికగా సచిన్ ఆడిన ఇన్నింగ్స్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించాడు.
తన కెరీర్ ఆరంభంలో ఇలాగే ఆఫ్ స్టంప్ మీద పడిన బంతిని వెంటాడుతూ ఔట్ అయ్యాడని, ఆ తరువాత మళ్లీ ఇప్పుడు అదే బలహీనతో కోహ్లీ పెవిలియన్‌కు చేరుకుంటున్నాడని గవాస్కర్ తెలిపాడు. అప్పుడు సచిన్ కూడా ఇలాగే ఔట్ అయ్యాడని గవాస్కర్ చెప్పాడు. అడిలైడ్ కంటే ముందు జరిగిన మూడు టెస్టు మ్యాచుల్లో సచిన్ ఆఫ్ స్టంప్ మీద పడిన బంతులను ఆడి కవర్స్ లేదా సిప్స్‌లో ఔట్ అయ్యాడని గుర్తు చేశాడు. కానీ అడిలైడ్‌లో మాత్రం సచిన్ ఎంతో పట్టుదలతో ఒక్క కవర్ డ్రైవ్ కూడా ఆడలేదన్నాడు. మిడాన్, మిడాఫ్ వైపుగానే ఆడుతూ 241 పరుగులు స్కోరు చేశాడని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కోహ్లీ సైతం ఔట్ సైట్ ఆఫ్ స్టంప్ బంతులను ఆడకూడదని నిర్ణయించుకోవాలన్నాడు.
సచిన్ ఎలాగైతే డబుల్ సెంచరీ చేశాడో అలాగే కోహ్లీ సైతం గబ్బాలో డబుల్ సెంచరీతో చెలరేగాలని గవాస్కర్ ఆకాంక్షించాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్‌తో పాటు ఆ జట్టు పేసర్లు కోహ్లీ బలహీనతను కనిపెట్టారని, గబ్బాలోనూ ఆ జట్టు ఆఫ్ స్టంప్ వ్యూహాన్నే అనుసరించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించాడు. ఈ క్రమంలో సచిన్ అడిలైడ్ ఇన్నింగ్స్ నుంచి కోహ్లీ స్ఫూర్తి పొందాలని గవాస్కర్ సూచించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ శనివారం నుంచి గబ్బాలో మొదలుకానుంది. ప్రస్తుతం ఇరు జట్లు చెరొక టెస్ట్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి.