గుజరాత్‌లో బిల్కిస్ బానో (Bilkis Bano)పై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసుల్లో దోషులకు ఇచ్చిన రెమిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 11 మందిని జైలు నుంచి ముందుగానే విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
గుజరాత్ అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానోపై (Bilkis Bano) సామూహిక అత్యాచారం జరిగింది. ఆ తర్వాత బానో కుటుంబసభ్యులను కూడా హత్యచేశారు. ఈ సంఘటనలో 11మంది దోషులు అరెస్ట్ అవగా.. తర్వాత వాళ్ళకి రెమిషన్ (క్షమాభిక్ష) కింద జైలు శిక్ష కంటే ముందే విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. దీన్ని సవాల్ చేస్తూ బాధితుల తరపున దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఆ ఖైదీలకు రెమిషన్ మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ 11 మంది కూడా రెండు వారాల్లోగా లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది.
2002లో గోద్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన జరిగింది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారం జరగింది. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. అయితే, వీళ్ళకి గుజరాత్ కోర్టు రెమిషన్ మంజూరు చేయడంతో 2022 ఆగస్టు 15న విడుదలయ్యారు. దోషుల ముందస్తు విడుదలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో దోషులకు రెమిషన్ మంజూరు చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని తెలిపింది కోర్టు.