రోహిత్ ను తీసేసి బూమ్రాకు ఇవ్వండి, కెప్టెన్సీపై గవాస్కర్ సూచన

న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై ఘోరపరాభవం ఇప్పట్లో భారత్ అభిమానులు మరిచిపోయేలా లేరు. అటు మాజీ ఆటగాళ్ళు సైతం ఈ ఓటమి తర్వాత టీమిండియాను ఏకిపడేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ లపై విమర్శలు గుప్పిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - November 7, 2024 / 01:54 PM IST

న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై ఘోరపరాభవం ఇప్పట్లో భారత్ అభిమానులు మరిచిపోయేలా లేరు. అటు మాజీ ఆటగాళ్ళు సైతం ఈ ఓటమి తర్వాత టీమిండియాను ఏకిపడేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ లపై విమర్శలు గుప్పిస్తున్నారు. సారథిగా రోహిత్ ను తప్పించాలన్న వాదన కూడా మొదలైంది. దీనిపై మాజీ ఆటగాళ్ళు సైతం అభిమానుల వాదనకే మద్ధతు పలుకుతున్నారు. అయితే మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మాత్రం ఆసీస్ టూర్ కు కెప్టెన్సీ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గవాస్కర్‌ స్పందించాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను తప్పించాలని బీసీసీఐకి సూచించాడు. అతడి స్థానంలో ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను సారథిగా నియమిస్తే జట్టుకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. రోహిత్ తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేకుంటే మాత్రం సెలక్షన్‌ కమిటీ కాస్త కఠినంగానే వ్యవహరించాలన్నాడు.

ఒకవేళ రోహిత్‌కు విశ్రాంతినివ్వాలనుకుంటే ఇవ్వమన్నాడు. కానీ వ్యక్తిగత కారణాలతో కొన్ని మ్యాచ్ లకు దూరమైతే మాత్రంఈ టూర్‌లో అతడిని కేవలం ఆటగాడినే పరిగణించాలని సూచించాడు. ప్రస్తుతం ఈ సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ఉన్న బూమ్రానే పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించాలన్నాడు. వ్యక్తుల కంటే కూడా భారత క్రికెట్‌ బాగోగులే మనకు ముఖ్యమని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ఒకవేళ మనం న్యూజిలాండ్‌ సిరీస్‌ను 3-0తో గెలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నాడు. కెప్టెన్‌ ఉంటేనే జట్టు ఐకమత్యంగా ఉంటుందనీ, ఆరంభంలో ఒక సారథి.. ఆ తర్వాత మరో కెప్టెన్‌ వచ్చాడంటే పరిస్థితి మన ఆధీనంలో ఉండకపోవచ్చని గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు.అటు భారత మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా సైతం ఈ వ్యాఖ్యలను సమర్థించాడు.

తొలి రెండు టెస్టులకు తాను అందుబాటులో ఉండకపోవడంపై ఇప్పటికే రోహిత్ బీసీసీఐ దగ్గర అనుమతి తీసుకున్నట్టు సమాచారం. దీంతో వైస్ కెప్టెన్ గా ఉన్న బూమ్రానే టీమ్ ను లీడ్ చేయనున్నాడు. కాగా బుమ్రా టెస్టుల్లో ఇప్పటి వరకు టీమిండియాకు ఒకేసారి సారథ్యం వహించాడు. ఇంగ్లండ్‌తో 2022లో జరిగిన బర్మింగ్‌హామ్‌ టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి మొదలుకానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే భారత్ ఈ సిరీస్ లో 4 టెస్టులు గెలవాల్సి ఉంటుంది. గత రెండు పర్యాయాలు ఆసీస్ గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ గెలవడంతో ఈ సారి కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.