జగన్‌ను ఓడిస్తాం.. అధికారంలోకి వస్తాం అని పదేపదే చెప్తూ.. పట్టుదలతో జనాల్లోకి వెళ్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. వారాహి యాత్రతో తన దూకుడు ఏంటో చూపిస్తున్నారు. అటు టీడీపీతోనూ పొత్తు పెట్టుకున్న పవన్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చేది లేదని అంటున్నారు. ఇలాంటి సమయంలో జనసేనకు రెండు భారీ షాక్‌లు తగిలాయ్. ఇద్దరు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. వారాహి యాత్ర సూపర్ సక్సెస్ అయిందని సంబరపడుతుంటే.. వరుస రాజీనామాలు గ్లాస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయ్. పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి.. జనసేనకు రాజీనామా చేశారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆమె.. 2014ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఐతే 3నెలల కింద పిఠాపురం ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది జనసేన.
దీంతో.. మనస్థాపానికి గురైన శేషుకుమారి.. పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆమె ఏ పార్టీలో చేరతారనేది క్లారిటీ రావాల్సి ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి శేషుకుమారి ఉన్నారు. జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీద పవన్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో వరుస రాజీనామాలు జనసేనకు ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. నెల్లూరులోనూ గ్లాస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు, నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జి కేతంరెడ్డి వినోద్ రెడ్డి.. జనసేకు గుడ్ బై చెప్పారు. పవన్‌తో పాటు అసెంబ్లీలో అడుగుపెడితే జనాలకు సేవ చేయొచ్చు అనుకున్నానని.. ఐతే పొత్తు ప్రకటించి తన ఆశలు అడియాశలు చేశారని వినోద్ రెడ్డి ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
నెల్లూరు సిటీ నియోజకవర్గానికి.. మాజీ మంత్రి నారాయణను అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. దీంతో అదే స్థానంపై ఆశలు పెట్టుకున్న వినోద్ రెడ్డి.. తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. పార్టీ కోసం ఎంత అయినా పనిచేస్తానని.. ఐతే నారాయణను గెలిపించాలనే విషయాన్ని మనసులో మోస్తూ పనిచేయలేనని.. ఇది ఒకరకంగా ఆత్మహత్యలాంటిదే అంటూ ఎమోషనల్ అయ్యారు వినోద్ రెడ్డి. అన్నీ ఆలోచించే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన పరిస్థితి ఏంటి.. ఇంకెన్ని షాక్‌లు తగులుతాయో అనే చర్చ.. ఏపీ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.