బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో TSPSC ప్రశ్నాపత్రాలను లీక్ (papers leak) చేసి కమిషన్ ను భ్రష్టు పట్టించారు. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. ఈ దారుణాలు చూడలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ TSPSC కి రిజైన్ చేసి ఈ పాపం నుంచి బయటపడాలనుకున్నారు మాజీ ఛైర్మన్ అండ్ మెంబర్స్. రేవంత్ సర్కార్ మాత్రం పేపర్ల లీకేజీలో ఎవర్నీ వదిలిపెట్టేటట్టు లేదు. రిజైన్ చేసిన ఈ మాజీల పాత్రపై విచారణ నిర్వహించాలని డిసైడ్ అయింది.
కేసీఆర్ (KCR) హయాంలో TSPSC పరువు గోదాట్లో కలిసింది. తెలంగాణ వచ్చిన కొత్తలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్టార్ట్ చేసిన TSPSCని తర్వాత దేశంలో అత్యంత హీనస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఒక నిర్ధిష్టమైన జాబ్ కేలండర్ లేకుండా… కేవలం ఎన్నికల ముందే జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. హడావిడి పరీక్షల నిర్వహణలో ఎగ్జామ్ పేపర్లు లీక్ అవుతున్నా… అప్పటి ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిగానీ, TSPSC సభ్యులు గానీ పట్టించుకోలేదు. ఒక్కో పేపర్ మార్కెట్లో లక్షలకు అమ్ముకున్నారు కొందరు కేటుగాళ్ళు.
ఈ దారుణాలతో లక్షల మంది తెలంగాణ నిరుద్యోగులు తల్లడిల్లిపోయారు. రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేశారు. కానీ పేపర్లు లీకైతే మాకేంటి సంబంధం అన్నట్టుగా మాట్లాడారు అప్పటి మంత్రి కేటీఆర్ (KTR). నిరుద్యోగుల నుంచి ఇంత ఆగ్రహం వ్యక్తం అవుతున్నా… కేసీఆర్ నోటి నుంచి ఒక్క ముక్క రాలేదు. దాంతో రగిలిపోయిన నిరుద్యోగులు మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ను ఇంటికి పంపి కాంగ్రెస్ కు అవకాశం కల్పించారు. పేపర్ లీక్స్ పై బీఆర్ఎస్ ప్రభుత్వం సిట్ వేసి ఎంక్వైరీ చేసినా… కాంట్రాక్ట్ ఉద్యోగులు, పేపర్ అమ్మిన, కొనుక్కున్న వాళ్ళపైనే కేసులు పెట్టింది. కానీ TSPSC పర్మినెంట్ ఉద్యోగులు, ఛైర్మన్, సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే… TSPSC లో ఒక్కొక్కరు రాజీనామాలు చేసి గవర్నర్ తమిళిసైకి పంపారు. ఛైర్మన్ గా బి.జనార్ధన్ రెడ్డి చేసిన రాజీమానాను గవర్నర్ చాలా రోజులు ఆమోదించలేదు.
పేపర్ల లీకేజీకి ఆయన కూడా బాధ్యత వహించాలనీ… యాక్షన్ తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. దాంతో ఇప్పుడు రేవంత్ సర్కార్ గతంలో రాజీనామా చేసిన TSPSC ఛైర్మన్, నలుగురు సభ్యులపైనా విచారణ చేయించాలని నిర్ణయించింది. గతంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొని ఇంకా రాజీనామా చేయని అరుణకుమారిపై ముందుగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. 2010లో అప్పటి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న జగన్ మోహన్ పై ఏసీబీ అధికారులు అదాయానికి మించి ఆస్తుల కేసు పెట్టారు. ఆయన భార్య అరుణకుమారి… అప్పట్లో స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆమెపైనా కేసు నమోదైంది. వీళ్ళపై చట్టపరమైన విచారణకు బదులు భారీ జరిమానా వేయాలని ఉమ్మడి ఏపీ సర్కార్ 2013లో ఉత్తర్వులు ఇచ్చింది.
కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. కానీ ఆ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ రిపోర్ట్ ఏమైంది. వాళ్ళపై చర్యలు తీసుకున్నారా… లేదా అన్నది ఇప్పటికీ తేలలేదు. అక్రమ ఆదాయ ఆరోపణలు ఉన్నా… ఈలోగా బీఆర్ఎస్ పెద్దల దగ్గర పైరవీ చేసుకొని TSPSC మెంబర్ గా జాయిన్ అయ్యారు అరుణ కుమారి. అందుకే రేవంత్ సర్కార్ ఇప్పుడు ఆ ఫైల్ ను బయటకు తీసి… ఇంకా TSPSC సభ్యురాలిగానే కొనసాగుతున్న అరుణకుమారిని బర్తరఫ్ చేయించే పనిలో ఉంది. అలాగే TSPSC పేపర్ల లీకేజీలో గవర్నర్ తమిళిసై సూచించినట్టే జనార్థన్ రెడ్డితో పాటు, మిగతా సభ్యులపైనా విచారణ జరిపించేందుకు సిద్ధమవుతోంది. అయితే గత ప్రభుత్వం వేసిన సిట్ ను కొనసాగిస్తుందా… కొత్తగా ఎంక్వైరీ చేయిస్తుందా అన్నది ఇంకా డిసైడ్ చేయలేదు.