తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి…వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రావాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అందుకే అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. అయోధ్య రామమందిరం నిర్మాణం తర్వాత జనం మూడ్ బీజేపీ సైడ్ మళ్ళింది. కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియా కూటమి… ఎన్నికల నాటికి ఇంకా ఎన్ని పీలికలు అవుతుందో తెలియదు. కానీ తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోకపోతే రేవంత్ రెడ్డి ఇమేజ్ కు ఇబ్బంది. అందుకే సార్వత్రిక ఎన్నికల ముందు మంచి ప్లాన్ చేశారు కాంగ్రెస్ నేతలు.
అయోధ్య రామమందిరం… బాలక్ రామ్ కి ప్రాణప్రతిష్టతో వందల యేళ్ళుగా హిందువులు ఎదురు చూస్తున్న ఆశలు నెరవేరాయి. అది కేవలం బీజేపీ వల్ల… అంతకంటే ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ వల్లే సాధ్యమైందని జనం నమ్ముతున్నారు. జనరల్ గా లోకల్ గా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా… దేశం పరిస్థితి చూస్తే చాలామంది బీజేపీ వైపే మొగ్గు చూపిస్తుంటారు. అందుకే బీజేపీ కూడా రామమందిరం నిర్మాణాన్ని మాగ్జిమమ్ తన క్యాంపెయిన్ కోసం ఉపయోగించుకుంది. ఇంకా ఆలయం మొత్తం నిర్మాణం పూర్తికాకపోయినా… దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరక్క ముందే గుడి ప్రారంభించాలి అనుకుంది… అనుకున్నట్టే పూర్తి చేసింది. ఆలయం ప్రారంభం సందర్భంగా యావత్ ప్రపంచంలోని హిందువులు అందర్నీ ఓ మూడ్ లోకి తీసుకెళ్ళింది. అందుకోసం అయోధ్య అక్షింతలను ఇంటింటికీ చేర్చారు బీజేపీ, హిందూ సంఘాల కార్యకర్తలు, నేతలు. ఆలయం ప్రారంభానికి ముందు ఏ ఇంట్లో చూసినా ఇదే చర్చ. మీ ఇంటికి అక్షింతలు వచ్చాయా అని ఒకరొకరు అడిగేవారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ట మహోత్సవం నిర్వహించిన జనవరి 22నాడు అయితే జనమంతా ప్రత్యక్ష ప్రసారాలకు అతుక్కుపోయారు. ప్రతిష్ట పూర్తయ్యాక ఇళ్ళల్లో పూజలు చేశారు. మోడీ పిలుపుతో సాయంత్రం దీపాలు పెట్టి… తమ ఇంట్లో పండగలాగా చేసుకున్నారు.
అయోధ్య కార్యక్రమాన్ని బైకాట్ చేసి తప్పు చేసిన కాంగ్రెస్… ఇప్పుడు అలాంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తెలంగాణలో కూడా తీసుకురావాలని నిర్ణయించింది. అందుకోసం ఆసియాలోనే అతి పెద్ద గిరిజన మహోత్సవం… సమ్మక్క సారలమ్మ జాతరను ఉపయోగించుకుంటోంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా అక్కడి నుంచి అక్షింతలు ఇంటింటికీ పంపినట్టే… మేడారం నుంచి అమ్మవార్ల ప్రసాదం బంగారంను ఇంటింటికీ చేర్చాలని నిర్ణయించింది. మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో చాలామంది భక్తుల మొక్కులు తీర్చుకోడానికి బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని నైవేధ్యంగా సమర్పిస్తారు. కొంతమంది తమ కోరికలు తీరితే నిలువెత్తు బంగారం ఇస్తామని మొక్కుకొని… కోరిక తీరాక తమ బరువుకి తగ్గ బెల్లాన్ని అమ్మవార్లకు నైవేధ్యంగా అందిస్తారు.
మేడారం వెళ్ళి వచ్చిన వారు తప్పకుండా బెల్లం నైవేధ్యం తీసుకొచ్చి… తమ బంధువులు, ఇరుగుపొరుగు వారికి పంచుతారు. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే సమ్మక్క సారలమ్మ బంగారం ప్రసాదాన్ని రాష్ట్రంలో ప్రతి ఇంటికి చేర్చాలని నిర్ణయించింది. మంత్రి శ్రీధర్ బాబు చేసిన ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకే చెప్పారు. అధికారులతో కలసి పరిశీలించి అమలు చేయాలని మంత్రులు సీతక్క, కొండా సురేఖకు సూచించారు. మేడారం నుంచి బెల్లంతో పాటు అమ్మవారి పసుపు, కుంకుమలను కూడా జనానికి అందించాలని నిర్ణయించారు. గ్రామాలకు వెళ్ళే బంగారాన్ని… పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు, ఇతర కార్యకర్తలు చూసుకుంటారు. స్థానిక కాంగ్రెస్ కేడర్ చొరవ తీసుకొని బంగారం ప్రసాదాన్ని తెలంగాణలోని ప్రతి ఇంటికీ చేర్చాలని నిర్ణయించారు. లోక్ సభ ఎన్నికల ముందు బిజేపీ మూడ్ నుంచి తెలంగాణ జనాన్ని తమవైపునకు టర్న్ చేసుకోడానికి కాంగ్రెస్ చేపట్టిన… ఈ ఇంటింటికీ బంగారం ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.