REVANTH REDDY: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీలో అధికారికంగా ప్రకటించారు కాంగ్రెస్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. దాంతో ఈనెల 7న తెలంగాణ మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ మూడో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆదివారం నుంచి కొనసాగిన సస్పెన్స్ ఎట్టకేలకు తొలగిపోయింది. ఆదివారం నాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవగా.. అందులో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ వచ్చింది.
Revanth Reddy : సీఎంగా రేవంత్ రెడ్డి.. విద్యార్థి నేత నుంచి సీఎం దాకా..
అయితే రెండు రోజుల పాటు సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎవరి పేరును ప్రకటిస్తుందన్న దానిపై సస్పెన్స్ కొనసాగింది. గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సోమవారం నాడు హోటల్ ఎల్లాలో సమావేశమయ్యారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, AICC పరిశీలకులు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానానికి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేశారు ఎమ్మెల్యేలు. ఆ తర్వాత AICC నుంచి వచ్చిన పరిశీలకులు కూడా ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా కలుసుకొని అభిప్రాయ సేకరణ జరిపారు. ఇందులో రేవంత్ రెడ్డికే ఎక్కువ మంది సపోర్ట్ చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత డీకే శివకుమార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, AICC పరిశీలకులు ఢిల్లీ వెల్లిపోయారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఇంట్లో.. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ అరగంట పాటు సమావేశం అయ్యారు. ఆ మీటింగ్ లోనే రేవంత్ ను సీఎం గా ప్రకటించాలని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పినట్టు తెలిసింది.
ఉదయమే ఢిల్లీ వెళ్ళిన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వేణుగోపాల్ తో పాటు మిగతా నేతలతో సమావేశం అయ్యారు. తమ డిమాండ్లను అధిష్టానం ముందు ఉంచారు. సాయంత్రం తర్వాత రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రమ్మని కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. గత రెండు రోజులుగా హోటల్ ఎల్లాలోనే ఉన్న రేవంత్.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ఆయన బయల్దేరిన కొద్దిసేపటికే కేసీ వేణుగోపాల్ రావు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి.. రేవంత్ ను సీఎల్పీ నేతగా ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈనెల 7న ప్రమాణం చేస్తారని తెలిపారు. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత.. భట్టి, ఉత్తమ్ మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండానే వెల్లిపోయారు. సీఎల్పీ నేతగా ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ సీనియర్లు, ముఖ్యనేతలకు ధన్యవాదాలు తెలిపారు.