REVANTH REDDY: లక్ష కోట్లు పెట్టి.. లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు.. కేసీఆర్ సర్కార్‌పై రేవంత్ ఫైర్

రూ.94 వేల కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమే. అక్టోబర్‌ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇంజినీర్లు తెలిపారు. నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ వివరించింది. అయితే, సమస్య తెలిసినా, చక్కదిద్దే ప్రయత్నం చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం.

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 08:18 PM IST

REVANTH REDDY: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టినా.. లక్ష ఎకరాలకు కూడా నీళ్లు అందలేదని విమర్శించారు తెలంగాణ సీఎం రేవంత్. మంగళవారం కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు సందర్శన అనంతరం సీఎం రేవంత్.. మీడియాతో మాట్లాడారు. గత కేసీఆర్ పాలనపై, ప్రాజెక్టులో లోపాలపై తీవ్ర విమర్శలు చేశారు.

KCR: చేతగాని వాళ్ల రాజ్యం ఇలాగే ఉంటుంది.. మాకంటే గొప్పగా పాలించి చూపించండి.. కాంగ్రెస్‌కు కేసీఆర్ సవాల్

“కాళేశ్వరం కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా.. ఇప్పటివరకు లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదు. కేసీఆర్‌ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారు. రూ.94 వేల కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమే. అక్టోబర్‌ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇంజినీర్లు తెలిపారు. నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ వివరించింది. 2020-21లోనే సమస్య ఉందని ఇంజినీర్లు చెప్పారు. అయితే, సమస్య తెలిసినా, చక్కదిద్దే ప్రయత్నం చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. సమస్యలపై వరుసగా మూడు సంవత్సరాలు అధికారులు ఎల్​అండ్​టీకి నోటీసులు ఇచ్చారు. 2019లోనే పూర్తయిన ప్రాజెక్ట్​కు 2020లో పూర్తిగా సమస్యలు బయటపడ్డాయి. అయినప్పటికీ రూ.15,900 కోట్ల బిల్లులు చెల్లించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు వచ్చిందో లేదో కానీ, ఏటా విద్యుత్ బిల్లులే రూ.10,500 కోట్లు అవుతున్నాయి. కాళేశ్వరం రుణాలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా రూ.25 వేల కోట్లు అవసరం. అధికారులు లెటర్స్​ రాసినా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు మొత్తం కుంగిపోయి, కూలిపోయే స్థితికి వచ్చింది. 2020లోనే ఈ బ్యారేజీకి ముప్పు ఉందని అధికారులు ఎల్&టీ కి లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి దాదాపు రూ.2లక్షల కోట్లు ఖర్చవుతుంది. వాళ్లు దిగిపోయారు కాబట్టి తమకేం సంబంధం లేదని కేసీఆర్ చెబుతున్నారు.

ప్రాజెక్ట్ పూర్తవటంతో బాధ్యత తీరిపోయిందని ఎల్​అండ్​టీ చెబుతోంది. అవినీతిని కప్పి పుచ్చుకునేందుకే నల్గొండలో కేసీఆర్ సభ పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన ఏ బ్యారేజీలోనూ ఇప్పుడు నీళ్లు లేవు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో ఒకే తరహా సమస్య ఉంది. ప్రస్తుతం సీపేజీ చేసి అన్నారం, సుందిళ్లలో సమస్యను కప్పిపుచ్చారు. ప్రాజెక్టు పూర్తయ్యిందని చెప్పిన మరుసటి సంవత్సరమే సమస్యలు బయటడ్డాయి. అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. రీడిజైన్ పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారు. చావు నోట్లో తలపెట్టాను అని కేసీఆర్ అంటున్నారు. అది నమ్మే రెండుసార్లు అవకాశం ఇచ్చారు. కానీ, అవకాశం ఇస్తే ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ దోచుకున్నారు” అని రేవంత్​ రెడ్డి వ్యాఖ్యానించారు.