REVANTH REDDY: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మరోసారి తన మార్క్ చూపించారు. విధి నిర్వహణలో చనిపోయిన ఓ కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగమిప్పించి ఆ కుంటుంబానికి అండగా నిలిచారు. దీంతో రెండేళ్లుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఆ మహిళకు రాచకొండ సీపీ స్వయంగా నియామక పత్రం అందించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అంబర్‌పేట పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో సొంగా శేఖర్ కానిస్టేబుల్‌గా పని చేసేవాడు.
REVANTH REDDY: శాసన మండలిపై రేవంత్ వ్యాఖ్యలు.. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీలు..
2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. అతని భార్య సత్యలత ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన మహిళ కావడంతో ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి గత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో రెండేళ్ల నుంచి ఆమె ఖాళీగానే ఉంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ కుటుంబ దీనస్థితిని వివరించారు. తమకు ఉద్యోగం ఇప్పించాలని కోరారు. స్పందించిన ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ, రాచకొండ సీపీకి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం.. డీజీపీ శేఖర్ భార్యకు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వాలని రాచకొండ కమిషనరేట్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు రాచకొండ సీపీ.. సత్యలతను జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ నియామక పత్రం అందించారు.
ప్రభుత్వం ప్రత్యేకంగా నిబంధనలు సడలించి ఉద్యోగం ఇచ్చిందని సత్యలతకు తెలిపారు. సమర్ధవంతంగా నీతి, నిజాయితీతో పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో కూడా మీ కుటుంబానికి అండగా ఉంటామని కమిషనర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డీజీపీ, రాచకొండ పోలీస్ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రూల్స్‌ను పక్కనపెట్టి మరీ బాధిత కటుంబానికి అండగా ఉండటంతో సీఎం రేవంత్ విమర్శకుల ప్రసంశలు సైతం అందుకుంటున్నారు.