Revanth Reddy: కాంగ్రెస్‌ గెలిస్తే సీతక్కే సీఎం.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. సరిగ్గా ఆరు నెలల ముందు వరకు వార్ వన్‌సైడ్ అన్నట్లు కనిపించిన రాజకీయం.. ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది.

  • Written By:
  • Publish Date - July 10, 2023 / 04:15 PM IST

బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు కొన్నిరోజులు రాజకీయ యుద్ధం కనిపించగా.. ఇప్పుడు బీజేపీ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చి చేరింది. ఖమ్మం సభ తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. అధికారం ఖాయం అని ధీమాతో కనిపిస్తున్నారు హస్తం పార్టీ నేతలు. ఇలాంటి పరిణామాల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీతక్క సీఎం కాబోతున్నారనంటూ ఆయన మాట్లాడిన మాటలు.. రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయ్.

అమెరికాలో తానా సభల్లో పాల్గొన్న రేవంత్‌కు.. నిర్వాహకులు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. దళితులు, ఆదివాసీలకు సీఎం అయ్యే చాన్స్ లేదా అంటూ రేవంత్‌ను ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్‌లో లేదని.. అవసరం అయితే.. సీతక్కను పార్టీ ముఖ్యమంత్రిని చేస్తుందంటూ రేవంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆరు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న దళిత నేత మల్లిఖార్జున ఖర్గే.. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారని గుర్తు చేశారు రేవంత్‌.

ఈ సభలకు సీతక్క కూడా హాజరయ్యారు. తెలంగాణ రాజకీయాలతో పాటు ఏపీ పరిణామాలను కూడా రేవంత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమరావతి, పోలవరం తామే నిర్మిస్తామంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఎలా ఉన్నా.. రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో ఎలాంటి ప్రకంపనలు రేపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అసలే సీనియర్లు వర్సెస్ రేవంత్ అన్నట్లు ఉంది పార్టీలో పరిస్థితి. పైగా సీతక్క.. రేవంత్ మనిషి అనే ముద్ర ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య అవసరం అయితే సీతక్కను పార్టీ ముఖ్యమంత్రి చేస్తుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త మంటలు రేపడం ఖాయంగా కనిపిస్తోంది.