సంచలనాలు, ఆర్జీవీ.. ఈ రెండు కలిసే ఉంటాయ్ అనిపిస్తుంటాయ్.. వివాదాలు చూస్తుంటే ! ట్విట్టర్‌ను ఫుట్‌బాల్ ఆడుకునే టైప్ ఆర్జీవీ. వోడ్కా ఎక్కువ రాస్తాడో.. రాయాలని వోడ్కా వేస్తాడో కానీ.. ఆయన ట్వీట్లు కన్ఫ్యూజింగ్‌గా కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారుతుంటాయ్. టీడీపీని, పవన్‌ను ఎప్పుడు టార్గెట్ చేసే ఆర్జీవీ.. ఏపీ రాజకీయాలపై కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉంటున్నాడు. పోలింగ్‌కు రెండు మూడు రోజుల ముందు నుంచే.. రాజకీయాల గురించి మాట్లాడడం మానేశారు. సినిమా ప్రమోషన్లకు సంబంధించిన ట్వీట్లు చేస్తున్నారు తప్ప.. టీడీపీ గురించి కానీ, పవన్ గురించి కానీ.. వైసీపీ గురించి కానీ.. ఒక్క మాట అనడం లేదు. దీంతో ఆంధ్రా రాజకీయాల గురించి మాట్లాడ్డానికి ఆర్జీవీ భయపడుతున్నాడా.. కూటమి గెలిచేలా ఉందని తెలియడంతో.. సైలెన్స్ అయిపోయారా అనే ప్రచారం జరుగుతోంది. టీడీపీని, పవన్‌ను ఇప్పుడు కదిలిస్తే.. రేపు అధికారంలోకి వచ్చాక రివేంజ్ తీర్చుకుంటారని ఆర్జీవీ వణికిపోతున్నాడని.. అందుకే రాజకీయాల గురించి ఏమీ మాట్లాడడం లేదనే టాక్ నడుస్తోంది. కట్ చేస్తే.. ఏపీ రాజకీయాలను పట్టించుకోని ఆర్జీవీ.. డైరెక్టర్స్ అసోసియేషన్ పేరుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అది చూసిన నెటిజన్లు.. రాజకీయాల విషయంలో ఆర్జీవీ మారారంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. 2019 ఎన్నికల ముందు కూడా వైసీపీకి మద్దతుగా నిలిచారు వర్మ. ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా ఆయన తన సపోర్ట్ కంటిన్యూ చేశారు. వైసీపీకి ప్రత్యర్థి ఎవరైనా సరే.. పోస్ట్‌లతో విరుచుకుపడేవారు. దీంతో వైసీపీ, ఆర్జీవీ మధ్య ఏదో ఒప్పందం ఉందని అనుకునేవారు అంతా ! ఐతే ఇప్పుడు ఆ అగ్రిమెంట్ అయిపోయిందని.. అందుకే మౌనంగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. తెలంగాణ సీఎం రేవంత్.. ఆర్జీవీకి మంచి ఫ్రెండ్. రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆర్జీవీ సినిమా ఫంక్షన్లకు రెగ్యులర్‌గా వచ్చేవాడు. సినిమాలు, రాజకీయాలకు మించి.. తమ మధ్య అనుబంధం ఉందని చాలాసార్లు చెప్పారు రేవంత్. ఐతే ఇప్పుడు సడెన్‌గా రేవంత్‌ను వెళ్లి ఆర్జీవీ కలవడం.. మరింత ఆసక్తి రేపుతోంది.