మార్కెట్లో బియ్యం ధరలు మునుపెన్నడూ లేనివిధంగా భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 25 నుంచి 26శాతం దాకా పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. దాంతో పాత బియ్యం కొనలేక సామాన్యులు, మధ్యతరగతి జనం అవస్థలు పడుతున్నారు. కొత్తబియ్యం మార్కెట్లోకి వచ్చినా… వాటిని అప్పుడే తినలేని పరిస్థితి. ఈసారి వర్షాభావ పరిస్థితులతో కృష్ణాబేసిన్ లో పంట దిగుబడి తగ్గిపోయింది. దాంతో సన్నధాన్యం దొరక్కపోవడం వల్లే రేట్లు పెరిగినట్టు చెబుతున్నారు. ప్రతి నెలా సగటున క్వింటాకు రూ.200 నుంచి 300 చొప్పున పెరుగుకుంటూ పోయాయి. ప్రస్తుతం సన్నబియ్యం ధర రూ.6500లుగా ఉన్నాయి. మార్కెట్లో వీటిని కిలో రూ.70కి అమ్ముతున్నారు. ఇతర రాష్ట్రాల్లో రేట్లు ఎక్కువగా ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యాన్ని కొందరు మిల్లర్లు పక్క రాష్ట్రాలకు అమ్ముకొని భారీగా సొమ్ముచేసుకున్నట్టు ఆరోపణలువస్తున్నాయి. మార్కెట్లో 25 కిలోల పాత బియ్యం బస్తా రూ.1500లకు అమ్ముతున్నారు. గత ఏడాది కంటే 200 నుంచి 300 రూపాయల దాకా రేట్లు ఎక్కువగా ఉన్నాయి.