భారత క్రికెట్ జట్టుకు ఆడడం ప్రతీ ఆటగాడి కల… గతంలో ఈ కలను నెరవేర్చుకునేందుకు చాలా కొద్ది మందికే అవకాశం దక్కేది. దేశవాళీ క్రికెట్ లో రాణించినా కూడా ఎంతో పోటీ ఉండడంతో 15 మందిలో చోటు దక్కించుకోవడం అంటే చాలా కష్టం… అలాంటిది ఐపీఎల్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసినా… ఒక్క సీజన్ తోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా అది ఐపీఎల్ తోనే సాధ్యమైంది. ఇలాంటి ఐపీఎల్ టాలెంట్ తో జాక్ పాట్ కొట్టిన క్రికెటర్లలో రింకూ సింగ్ కూడా ఒకడు.. గ్రౌండ్ లో దిగాడంటే అలవోకగా సిక్సర్లు బాదేసే రింకూ లైఫ్ స్టైల్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు రేకుల షెడ్డులో దిగువ మధ్యతరగతి జీవితం గడిపిన రింకూ సింగ్ ఇప్పుడు కోటీశ్వరుడు. పాత రేకుల షెడ్డు నుంచి కోట్ల విలువ చేసే బంగ్లా కొనే స్థాయికి చేరుకున్నాడు. పేదరికం నుంచి వచ్చిన రింకూ సింగ్‌కి ఒక పెద్ద బంగ్లాని కొనుగోలు చేయాలనే కల ఉండేదట. తాజాగా తన కలను నెరవేర్చుకున్నాడు. రింకూ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఉన్న ఓజోన్ సిటీ గోల్డెన్ ఎస్టేట్‌లో ఒక భారీ బంగ్లాను కొనుగోలు చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సౌతాఫ్రికా టూర్‌కు బయలుదేరే ముందు రింకూ తన కుటుంబంతో కలిసి సంప్రదాయ పూజలు చేసి కొత్త ఇంట్లోకి ప్రవేశించాడు.ఇకపై రింకూ సింగ్ గోల్డెన్ ఎస్టేట్ ఆఫ్ ఓజోన్ సిటీలోని ఇంటి నెంబర్ 38లో ఉండనున్నాడు. రింకూ సింగ్‌తో పాటు అతని తండ్రి ఖాన్ చంద్, తల్లి బీనా దేవి కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐపీఎల్ 2025 సీజన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో రింకూ సింగ్ కూడా ఉన్నాడు. రింకూ సింగ్‌ని 13 కోట్లకి కోల్‌కతా ఫ్రాంఛైజీ రిటెన్ చేసుకుంది. ఐపీఎల్ తోనే ఈ యువ క్రికెటర్ జీవితం మలుపు తిరిగింది. కాగా గత సీజన్ కోసం రింకూ సింగ్‌కి కోల్‌కతారూ.55 లక్షలే చెల్లించగా.. ఇప్పుడు 13 కోట్లు ఇవ్వబోతోంది.
2017 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న రింకూ సింగ్ ఇప్పటివరకు 45 మ్యాచ్‌లు ఆడి 893 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉండగా.. అతని స్ట్రైక్‌రేట్ 143.34గా ఉంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టిన రింకూ సింగ్ కేకేఆర్ కు సంచలన విజయాన్నందించాడు. తర్వాత భారత్ టీ20 జట్టులోనూ కీలక ప్లేయర్‌గానూ రింకూ ఎదిగాడు. టాప్ ఆర్డర్‌లో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల రింకూ సింగ్ కు.. అలవోకగా సిక్సర్లు బాదే సత్తా ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఫినిషర్‌గా రింకూ సింగ్‌కి అద్భుతమైన రికార్డుంది.