రోహిత్ క్షమించమన్నాడు సంజూ సంచలన వ్యాఖ్యలు

భారత క్రికెట్ లో సంజూ శాంసన్ కి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టే అనిపిస్తోంది. అవకాశాలు ఎన్ని వచ్చినా అంతర్జాతీయ స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయాడన్న అభిప్రాయం చాలాకాలంగా అతనిపై ఉంది. అయితే ఇటీవల బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ లో మాత్రం సంజూ శాంసన్ అదరగొట్టాడు.

  • Written By:
  • Publish Date - October 22, 2024 / 07:09 PM IST

భారత క్రికెట్ లో సంజూ శాంసన్ కి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టే అనిపిస్తోంది. అవకాశాలు ఎన్ని వచ్చినా అంతర్జాతీయ స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయాడన్న అభిప్రాయం చాలాకాలంగా అతనిపై ఉంది. అయితే ఇటీవల బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ లో మాత్రం సంజూ శాంసన్ అదరగొట్టాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఏకంగా సెంచరీ బాదేశాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్ తోనే సమాధానమిచ్చిన సంజూ ఇప్పుడు రంజీ సీజన్ కోసం రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్యూలో సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనను క్షమాపణలు కోరాడని చెప్పాడు. వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా జరిగిన సంఘటనను అతను పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో చివరి నిమిషంలో తుది జట్టు నుంచి తనను తప్పించారని గుర్తు చేసుకున్నాడు. ఫైనల్‌కు ముందు రోజు తుది జట్టులో ఉన్నావని, మ్యాచ్‌కు సిద్దం కావాలని చెప్పారని, కానీ టాస్ ముందు ఎలాంటి మార్పులు చేయడం లేదనడం బాధ కలిగించిందన్నాడు.

ఆఖరి నిమిషంలో తన అదృష్టం తారుమారైందని.. పాత జట్టుతోనే టైటిల్‌ మ్యాచ్‌ ఆడాలనే నిర్ణయం తీసుకున్నారని సంజూ పేర్కొన్నాడు. ఈ క్రమంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన దగ్గరకు వచ్చి మాట్లాడిన మాటలను ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. జట్టు నుంచి నన్ను తప్పిస్తూ ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో రోహిత్ వివరించాడని గుర్తు చేసుకున్నాడు. ఆఖరి నిమిషంలో ఇలా కూడా జరుగుతుందని తెలుసు కదా! ఇది సహజంగా జరిగేదే అంటూ రోహిత్ మాటలను వెల్లడించాడు. తాను రోహిత్ భాయ్ పరిస్థితిని అర్థం చేసుకున్నానని వివరించాడు. మనం మ్యాచ్ గెలవాలని , ఆ తర్వాత మాట్లాడుకుందామంటూ రోహిత్ తో అన్నానని సంజూ చెప్పుకొచ్చాడు.

అయితే, నిమిషం తర్వాత మళ్లీ తన దగ్గరకు వచ్చిన రోహిత్ మనసులో నన్ను శపిస్తున్నావు కదూ అంటూ అడిగాడన్నాడు. నువ్వు సంతోషంగా లేవనీ, నీ మైండ్‌లో ఇంకేదో విషయం ఉందనిపిస్తోందని రోహిత్ అనగానే ఏం చెప్పాలో తెలియలేదన్నాడు. ఓ ఆటగాడిగా మ్యాచ్‌ ఆడాలని ఆశపడటం సహజమే అయినా కెప్టెన్ గా మీ నిర్ణయాన్నిపూర్తిగా గౌరవిస్తున్నానంటూ తాను సమాధానమిచ్చానని సంజూ ఇంటర్యూలో వెల్లడించాడు. రోహిత్ శర్మ స్థానంలో తానుంటే అలా మాట్లాడకపోయేవాడినని సంజూ వ్యాఖ్యానించాడు. ఆ సమయంలోనే రోహిత్మ తన నసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడనీ శాంసన్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో శాంసన్ స్థానంలో బరిలోకి దిగిన పంత్ డకౌటయ్యాడు.