ఓపెనర్ గా రోహిత్ శర్మ నితీశ్ పై వేటు, సుందర్ కు ఛాన్స్

భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ రేపటి నుంచి మొదలుకానుంది. మెల్ బోర్న్ వేదికగ జరగనున్న బాక్సింగ్ డే టెస్టు కోసం భారత తుది జట్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఓపెనింగ్ కాంబినేషన్ పై టీమ్ మేనేజ్ మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

  • Written By:
  • Publish Date - December 25, 2024 / 01:24 PM IST

భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ రేపటి నుంచి మొదలుకానుంది. మెల్ బోర్న్ వేదికగ జరగనున్న బాక్సింగ్ డే టెస్టు కోసం భారత తుది జట్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఓపెనింగ్ కాంబినేషన్ పై టీమ్ మేనేజ్ మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మ మళ్ళీ ఓపెనర్ గా ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. గత మూడు టెస్టుల్లోనూ జైశ్వాల్ తో కలిసి కెెఎల్ రాహుల్ ఓపెనర్ గా దిగాడు. అప్పుడు రోహిత్ మిడిలార్డర్ లో ఆడాల్సి వచ్చింది. నిజానికి తన కెరీర్ ను రోహిత్ మిడిలార్డర్ బ్యాటర్ గానే ప్రారంభించినా ఈ సిరీస్ లో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో సతమతమవుతున్న హిట్ మ్యాన్ గత రెండు టెస్టుల్లోనూ నిరాశపరిచాడు. ఇప్పుడు ఒత్తిడి పెరగడంతో మళ్ళీ ఓపెనర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

రోహిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగితే కేఎల్ రాహుల్ ఫస్ట్ డౌన్‌లో ఆడనున్నాడు. శుభ్‌మన్ గిల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ కొనసాగే ఛాన్స్ ఉంది. సిరాజ్‌ను పక్కనపెట్టాలని భావిస్తే హర్షిత్ రాణా తుది జట్టులోకి వస్తాడు. అటు తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు కోల్పోనున్నాడు. నిజానికి ఈ సిరీస్ లో భారత్ తరపున అత్యంత నిలకడగా రాణించిన ఆటగాడు నితీశ్ రెడ్డి మాత్రమే.. కానీ బౌలింగ్ పరంగా నితీశ్ పెద్దగా ప్రభావం చూపలేకపోతుండడంతో వేటు వేసేందుకు మేనేజ్ మెంట్ సిద్ధమైంది. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావించిన టీమిండియానితీష్ కుమార్ రెడ్డి స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఎక్స్‌ట్రా స్పిన్నర్‌గా తీసుకోనున్నట్టు సమాచారం. నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్‌తో పర్వాలేదనిపించినా.. బౌలింగ్‌లో తేలిపోయాడు. దాంతో బౌలింగ్ విభాగం బలహీనంగా మారిపోయింది. మరో స్పిన్నర్‌గా రవీంద్ర జడేజా కొనసాగనున్నాడు.

గబ్బా టెస్టులో దాదాపు ఓటమి ఖాయమనుకున్న దశలో టెయిలెండర్లు పోరాడడంతో ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కిన టీమిండియాకు సిరీస్ గెలవాలంటే మిగిలిన రెండు మ్యాచ్ లు కీలకమే.. అదే సమయంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో నిలిచేందుకు కూడా ఇరు జట్లకు చివరి రెండు టెస్టులు కీలకంగా మారాయి. కాగా మెల్ బోర్న్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని అంచనాలుండగా… మ్యాచ్ సాగేకొద్ది స్లో బౌలర్లకు కూడా కాస్త సహకరిస్తుందని భావిస్తున్నారు. ఓవరాల్ గా లోయర్ ఆర్డర్ లో మన బ్యాటింగ్ ను మరింత పటిష్టం చేసేందుకే వాషింగ్టన్ సుందర్ ను తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది.