రోహిత్ వర్సెస్ గంభీర్ కోచ్ మాట వినని కెప్టెన్

పుణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలిరోజే టీమిండియా అదరగొట్టింది. టాస్ ఓడినా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ తిప్పేయడంతో పైచేయి సాధించింది. కివీస్ ను 259 పరుగులకే ఆలౌట్ చేసింది. అయితే ఈ మ్యాచ్ కు తుది జట్టు కూర్పు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోక తప్పలేదు

  • Written By:
  • Publish Date - October 25, 2024 / 02:33 PM IST

పుణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలిరోజే టీమిండియా అదరగొట్టింది. టాస్ ఓడినా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ తిప్పేయడంతో పైచేయి సాధించింది. కివీస్ ను 259 పరుగులకే ఆలౌట్ చేసింది. అయితే ఈ మ్యాచ్ కు తుది జట్టు కూర్పు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. వైఫల్యాల బాటలో ఉన్న కెఎల్ రాహుల్ ను తప్పించారు. రాహుల్ విషయంలో కోచ్ గంభీర్ రోహిత్ శర్మ విభేదించినట్టు తెలుస్తోంది. తొలి టెస్టులో ఫెయిలైన కేఎల్ రాహుల్‌పై వేటు వేయాలని చాలా మంది మాజీలు సూచించగా.. హెడ్ కోచ్ గంభీర్ మాత్రం రాహుల్‌కి మద్దతుగా నిలిచాడు. కాన్పూర్ టెస్టులో బంగ్లాపై రాహుల్ మంచి ఇన్నింగ్స్ ఆడాడంటూ వ్యాఖ్యానించాడు. అతనికి వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

యువ ఆటగాళ్ళను పక్కన పెట్టి వరుసగా ఫెయిలవుతున్న రాహుల్ కు ప్లేస్ ఇవ్వడం ఎలాంటి వ్యూహమో చెప్పాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే తుది జట్టును డిసైడ్ చేసేది సోషల్ మీడియా కాదంటూ గంభీర్ కౌంటర్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్ మారింది. ఇదిలా ఉంటే తొలి టెస్టులో వీరోచిత శతకం బాదిన సర్ఫరాజ్ ఖాన్‌‌ను తప్పించి కేఎల్ రాహుల్‌కి మళ్లీ రెండో టెస్టులో చోటిస్తే తీవ్ర విమర్శలు తప్పవని భావించిన రోహిత్ శర్మ.. రిస్క్ తీసుకోకుండా రాహుల్‌పై వేటు వేశాడు. ఈ విషయంలో గంభీర్ సూచనను కూడా హిట్ మ్యాన్ పక్కన పెట్టేసినట్టు సమాచారం.

వాస్తవానికి తొలి టెస్టులో శుభమన్ గిల్ మెడనొప్పి కారణంగా ఆడలేదు. దాంతో సర్ఫరాజ్ ఖాన్‌కి అవకాశం వచ్చింది. దొరికిన అవకాశాన్ని తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై వృథా చేసుకున్నట్లు అనిపించిన సర్ఫరాజ్ ఖాన్.. రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు రెండో టెస్టుకి శుభమన్ గిల్ ఫిట్‌‌నెస్ సాధించి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా.. సర్ఫరాజ్ ఖాన్‌ను తప్పించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. కేఎల్ రాహుల్‌పై వేటు వేయక తప్పలేదు. అయితే వాషింగ్టన్ సుందర్ ఎంపికలో మాత్రమే గంభీర్ , రోహిత్ ఏకాభిప్రాయంతో ఉన్నట్టు జట్టు వర్గాలు చెబుతున్నాయి. అలానే సిరాజ్ ప్లేస్‌లో ఆకాశ్ యాదవ్ కు చోటిచ్చాడు. నిజానికి ఇది కూడా సరైన నిర్ణయంగానే పలువురు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే సిరాజ్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. బూమ్రాకు తోడుగా వికెట్లు తీయడంలో విఫలమవుతుండడంతో హైదరాబాదీ పేసర్ ను కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది.