బంగ్లాదేశ్ పై తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్ కోసం కాన్పూర్ వెళ్ళనుంది. చెన్నై వేదికగా తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేకంగా అభినందించాడు. మ్యాచ్ అనంతరం తన ఆనందాన్ని పంచుకున్న రోహిత్ పంత్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. అతడొక అద్భుతమని కితాబిచ్చాడు. కారు ప్రమాదం నుంచి పంత్ కోలుకున్న విధానం ఎవరికైనా స్ఫూర్తిగా నిలుస్తుందని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ , వరల్డ్ కప్ టోర్నీల్లోనూ రాణించాడని, ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కితాబిచ్చాడు. ఎంతో పోరాటపటిమ ఉంటే తప్ప అటువంటి ప్రమాదం నుంచి కోలుకోవడం అసాధ్యమంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.
పంత్ ఏమి చేయగలడో తమకు బాగా తెలుసన్న రోహిత్ అతనికి తగినంత సమయం ఇవ్వడమే ముఖ్యమని వ్యాఖ్యానించాడు. ఇక తొలి టెస్ట్ విజయం జట్టులో జోష్ పెంచిందని రోహిత్ చెప్పాడు. రానున్న రోజుల్లో ఉన్న బిజీ షెడ్యూల్ ను చూస్తే ఇది మంచి విజయంగా అభివర్ణించాడు. భారత్‌లో ఆడినా.. విదేశాల్లో ఆడినా బలమైన బౌలింగ్ చుట్టూనే జట్టును నిర్మించాలని అనుకుంటున్నట్టు రోహిత్ స్పష్టం చేశాడు. ఎలాంటి సవాళ్ళు ఎదురైనా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నామని, ఫైనల్ గా జట్టు మొత్తానికి ఈ విజయం క్రెడిట్ దక్కుతుందని రోహిత్ చెప్పాడు.