న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం భారత క్రికెట్ లో పెనుమార్పులకు కారణమయ్యేలా కనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలే దీనికి ఉదాహరణ… ఈ ఓటమిపై ఇప్పటికే గుర్రుగా ఉన్న బీసీసీఐ తాజాగా రివ్యూ చేసింది. గంభీర్, రోహిత్ లపై ప్రశ్నల వర్షం కురిపించింది. వారిచ్చిన వివరణతో బీసీసీఐ ఎలా రియాక్టయిందన్న దాని కంటే రివ్యూలో గంభీర్ పై రోహిత్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గంభీర్ ఏకపక్ష నిర్ణయాల గురించి బోర్డు పెద్దలకు చెప్పడం ద్వారా కోచ్ ను ఇరికించినట్టు తెలుస్తోంది. రివ్యూ మీటింగ్‌కి కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జై షా హాజరయ్యారు. ఈ సమావేశంలో గౌతమ్ గంభీర్‌పై పలు ఫిర్యాదులు చేసిన రోహిత్ శర్మ.. ఆఖరి టెస్టుకి ముంబయి పిచ్‌ను గంభీర్ మార్పించడంపై కూడా సమావేశంలో మండిపడినట్లు తెలుస్తోంది.
జట్టు ఎంపికలో గౌతమ్ గంభీర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఇప్పటికే పలు వార్తలు వెలువడగా.. ఆస్ట్రేలియా టూర్‌కి జట్టుని కూడా గంభీర్‌కి నచ్చినట్లే ఎంపిక చేశాడని ఆరోపణలు వినిపించాయి. దాంతో జట్టు ఎంపికపై ఇప్పటికే గుర్రుగా ఉన్న రోహిత్ శర్మ.. గంభీర్‌పై అవకాశం రాగానే కోచింగ్ శైలితో పాటు అన్ని విషయాల్ని రివ్యూలో చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆస్ట్రేలియా గడ్డపై గతంలో సత్తాచాటిన శార్ధూల్ ఠాకూర్‌ని ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకోవాలని కెప్టెన్ రోహిత్ శర్మ ప్రతిపాదిస్తే.. గంభీర్ మాత్రం రోహిత్ శర్మ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా నితీశ్ కుమార్ రెడ్డిని తీసుకున్నాడట. అలానే కొత్త బౌలర్ హర్షిత్ రాణా ఎంపికలోనూ గంభీర్ పాత్ర ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక పుణె, వాంఖడే పిచ్‌లను మూడోరోజు నుంచి బంతి తిరిగేలా తయారు చేయమని రోహిత్ శర్మ సూచిస్తే.. గంభీర్ మాత్రం మొదటి రోజు నుంచే బంతి తిరిగేలా తయారు చేయమని క్యూరేటర్లకి సూచించినట్లు వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా కెప్టెన్, హెడ్ కోచ్ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడితే అది టీమ్ నే గందరగోళంలోకి నెడుతుంది. దీంతో బీసీసీఐ పెద్దలు ఈ విషయంలో గౌతమ్ గంభీర్‌ను కాస్త హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఆస్ట్రేలియా టూర్ రూపంలో ఆఖరి అవకాశం ఇచ్చినట్లు కూడా సమాచారం. నవంబరు 22 నుంచి బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ జరగనుండగా… ఈ సిరీస్ లో ఐదు టెస్టులు ఆడనుంది. కనీసం నాలుగు టెస్టులు గెలిస్తేనే.. ఐసీసీ టెస్టు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి టీమిండియా అర్హత సాధిస్తుంది. అలానే సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. ఫైనల్ బెర్తు దక్కడం అనుమానమే. కాగా ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు విఫలమైతే.. గౌతమ్ గంభీర్‌ను తొలుత టీమ్ వన్డే, టీ20 కోచింగ్ బాధ్యతల నుంచి తప్పిస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.