రోహిత్ ఇదేం కెప్టెన్సీ… హిట్ మ్యాన్ పై విమర్శల వెల్లువ

టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ ఆడుతోంది. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించింది. ఆ టెస్టులో రోహిత్ శర్మ ఆడలేదు. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో రోహిత్ తిరిగి వచ్చాడు. ఇందులో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

  • Written By:
  • Publish Date - December 17, 2024 / 05:26 PM IST

టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ ఆడుతోంది. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించింది. ఆ టెస్టులో రోహిత్ శర్మ ఆడలేదు. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో రోహిత్ తిరిగి వచ్చాడు. ఇందులో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. మూడో టెస్టులోనూ భారత్‌ పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో రోహిత్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తన కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్‌ను 3-0తో కోల్పోయిన రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో దూకుడుగా వ్యవహరిస్తాడని అంతా భావించారు. కానీ రోహిత్ అంచనాలు ఏ మాత్రం అందుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా జట్టు కూర్పుపై రోహిత్ ఫెయిల్ అయ్యాడన్న వాదనలు వినిపించాయి. మ్యాచ్ సమయంలో బౌలర్లను సరిగ్గా వాడుకోలేకపోతున్నాడని మాజీలు విమర్శిస్తున్నారు. ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌లో రోహిత్ చాలా బలహీనంగా కనిపిస్తున్నాడు. వ్యూహాత్మకంగా ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నాడు. దీంతో అతని కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో రోహిత్ కెప్టెన్సీ అసమర్థంగా ఉంది. దీన్ని చూసి పలువురు వ్యాఖ్యాతలు ఆయనపై ప్రశ్నలు సంధించారు.

భారత టెస్టు వారసత్వాన్ని రోహిత్ నాశనం చేశాడని రవిశాస్త్రి ఆరోపించాడు. విరాట్ కోహ్లీకి 7 ఏళ్లు పట్టిన టెస్టు క్రికెట్ వారసత్వాన్ని రోహిత్ శర్మ నాశనం చేస్తున్నాడని, అతని కెప్టెన్సీ చాలా నిరాశపరిచింది అంటూ అసహనం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ 2014 నుంచి 2022 వరకు భారత టెస్టు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ కాలంలో కోహ్లీ టీమిండియా విజయవంతంగా నడిపించాడు. అతని కెప్టెన్సీలో టీం ఇండియా భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా టెస్ట్ సిరీస్‌లను గెలుచుకుంది. ఇందులో ఆస్ట్రేలియా కూడా ఉంది. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ 2021 WTC ఫైనల్‌కు చేరుకుంది. విరాట్ కెప్టెన్సీలో టీమిండియా 68 టెస్టులు ఆడింది. ఇందులో భారత్ 40 గెలిచింది, 17 ఓడిపోయింది. 11 డ్రా అయ్యాయి. అతని గెలుపు శాతం 70కి పైగా ఉంది. ఇది ఇప్పటి వరకు భారత టెస్టు కెప్టెన్లలో అత్యుత్తమం. టెస్టుల్లో ధోనీ విజయ శాతం కూడా 60 మాత్రమే.అయితే రోహిత్ మాత్రం వాళ్ళిద్దరిని అందుకోలేకపోతున్నాడు.