రోహిత్ మాటలు అర్థం కాలే గబ్బా ఇన్నింగ్స్ పై పంత్

భారత టెస్ట్ క్రికెట్ లో మరిచిపోలేని విజయంగా చెప్పుకునే వాటిలో 2021-22 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ఖచ్చితంగా ఉంటుంది. తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా సీనియర్ ప్లేయర్స్ లేకున్నా అద్భుతమైన ఆటతీరుతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ముఖ్యంగా గబ్బా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలుపు చారిత్రాత్మకంగా నిలిచిపోయింది.

  • Written By:
  • Publish Date - October 17, 2024 / 05:08 PM IST

భారత టెస్ట్ క్రికెట్ లో మరిచిపోలేని విజయంగా చెప్పుకునే వాటిలో 2021-22 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ఖచ్చితంగా ఉంటుంది. తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా సీనియర్ ప్లేయర్స్ లేకున్నా అద్భుతమైన ఆటతీరుతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ముఖ్యంగా గబ్బా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలుపు చారిత్రాత్మకంగా నిలిచిపోయింది. గబ్బా మైదానంలో 3 దశాబ్దాలకుపైగా తిరుగులేని ఆసీస్​కు భారత్​ ఓటమి రుచి చూపించింది. ఈ టెస్టు సిరీస్ నాలుగో మ్యాచ్​లో టీమ్ఇండియా 3 వికెట్ల తేడాతో నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ విజయంలో రిషభ్ పంత్​ది కీలక పాత్ర. 300 రన్స్ కు పైగా ఛేజ్ చేసే క్రమంలో రిషబ్ పంత్ అజేయంగా 89 పరుగులు బాది టీమ్ఇండియాకు విజయం అందించాడు. పంత్ కెరీర్​లో అత్యుత్తమ ఇన్నింగ్స్​లో ఇది ఒకటి. వారి సొంతగడ్డపై ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొని మ్యాచ్ ను గెలిపించడం ఆషామాషీ కాదు.

తాజాగా ఈ హిస్టారికల్ ఇన్నింగ్స్ పై పంత్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆ రోజు మ్యాచ్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ తనతో అన్న మాటలను గుర్తు చేసుకున్నాడు. అసలు నువ్వేం చేశావో తెలుసా అంటూ రోహిత్ భాయ్ అడిగాడని, జట్టును గెలిపించడమే లక్ష్యంగా ఆడానంటూ తాను సమాధానమిచ్చానని వెల్లడించాడు. నువ్వు ఏం చేసావనేది తర్వాత తెలుస్తుందంటూ చెప్పి వెళ్ళిపోయాడని పంత్ గుర్తు చేసుకున్నాడు. కానీ తర్వాత నుంచి ఫ్యాన్స్ అందరూ గబ్బా మ్యాచ్‌ గురించి మాట్లాడుకోవడం వింటే.. రోహిత్‌ అన్న మాటల అర్థం తెలిసిందని పంత్‌ వ్యాఖ్యానించాడు.

కాగా పంత్ కెరీర్ లో ఎప్పటికీ గబ్బా ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచిపోతుందని మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ మ్యాచ్ గెలవడంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సైతం భారత్ కైవసం చేసుకుంది. నిజానికి సిరీస్ ఆరంభంలో మన జట్టు 36 పరుగులకే కుప్పకూలి ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంది. కోహ్లీతో సహా పలువురు సీనియర్లు లేకున్నా యువ క్రికెటర్లు కలిసికట్టుగా రాణించి భారత్ కు అద్భుత విజయాన్ని అందించారు. ఆ తర్వాత సీజన్ లోనూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియానే గెలిచింది. ఇప్పుడు మూడోసారి కూడా గెలిచేందుకు సిద్ధమవుతుండగా… రిషబ్ పంత్ ను ఆసీస్ కు అప్పుడే కంగారు మొదలైంది.