ఐపీఎల్ మెగావేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి. కొన్ని ఊహించిన రిటెన్షన్లు ఉంటే.. మరికొన్ని ఊహించని రిటెన్షన్లు కూడా కనిపించాయి. గత సీజన్ లో రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ సంచలన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచింది. రిటెన్ జాబితాలో హెన్రిచ్ క్లాసెన్ కోసం ముందు నుంచీ అనుకున్నట్టుగానే భారీ మొత్తాన్ని వెచ్చించింది. ఏకంగా 23 కోట్ల రూపాయలతో క్లాసెన్ ను రిటైన్ చేసుకుంది. క్లాసెన్ గత సీజన్ లో పరుగుల వరద పారించాడు. పలు విధ్వంసకర ఇన్నింగ్స్ లతో సన్ రైజర్స్ కు భారీస్కోర్లు అందించాడు. ఓవరాల్ గా 2024 సీజన్ లో 16 మ్యాచ్ లు ఆడి 71 స్ట్రైక్ రేట్ తో 479 పరుగులు చేశాడు. దీనిలో 4 హాఫ్ సెంచరీలున్నాయి. క్లాసెన్ ను సన్ రైజర్స్ ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుందని అందరూ భావించినా 23 కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని మాత్రం అనుకోలేదు. రిటెన్షన్ రూల్స్ ప్రకారం 18 కోట్లు కంటే ఎక్కువ ఇచ్చే ఛాయిస్ ను బీసీసీఐ ఫ్రాంచైజీలకే వదిలేసింది.
అలాగే గత మినీ వేలంలో భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ ను కూడా సన్ రైజర్స్ తమతో పాటే కొనసాగించుకోనుంది. కమ్మిన్స్ సారథిగానూ గత సీజన్ లో ఆకట్టుకున్నాడు. దీంతో 18 కోట్లతో ఈ ఆసీస్ బౌలర్ ను రిటైన్ చేసుకుంది. ఇదిలా ఉంటే సన్ రైజర్స్ రిటైన్డ్ జాబితాలో ఇద్దరు స్వదేశీ క్రికెటర్లు జాక్ పాట్ కొట్టారు. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని కూడా రిటైన్ చేసుకుంది. అభిషేక్ శర్మ 14 కోట్లు అందుకోనుండగా… గత వేలంలో 20 లక్షలే పలికిన నితీష్ రెడ్డి ఈ సారి ఏకంగా 6 కోట్లు తీసుకోనున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ లో నితీశ్ రెడ్డి అదరగొట్టాడు. 300కు పైగా పరుగులు చేయడంతో పాటు బంతితోనూ రాణించాడు. ఇటీవలే అంతర్జాతీయ అరంగేట్రం కూడా చేసిన నితీశ్ ను సన్ రైజర్స్ వదులుకోదని ముందే ఊహించారు.
ఇక ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ను సైతం సన్ రైజర్స్ హైదరాబాద్ తమతో పాటే ఉంచుకోనుంది. గత సీజన్ లో హెడ్ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ లతో అదరగొట్టేశాడు. 15 మ్యాచ్ లలో 191 స్ట్రైక్ రేట్ తో 567 రన్స్ చేసిన హెడ్ 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. ఇదిలా ఉంటే సన్ రైజర్స్ అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా ఎవరినీ రిటైన్ చేసుకోలేదు. అదే సమయంలో పలువురు స్టార్ ప్లేయర్స్ ను వేలంలోకి వదిలేసింది. ఊహించినట్టుగానే మాజీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్, సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు గుడ్‌బై చెప్పింది. అలాగే ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ , నటరాజన్ లను కూడా వదిలేసింది. అయితే ఆర్టీఎం ఛాయిస్ ఒకటి ఉండడంతో వీరిద్దరిలో ఎవరిని తిరిగి తీసుకుంటుందో చూడాలి. మొత్తం 120 కోట్ల పర్స్ వాల్యూలో సన్ రైజర్స్ ఐదుగురు ప్లేయర్స్ కోసం 75 కోట్లు వెచ్చించింది. ఇక మిగిలిన 45 కోట్లతో జట్టు ఎంపికను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవిధంగా సన్ రైజర్స్ కు వేలంలో ఇది సవాల్ గానే ఉంటుంది.