తెలంగాణలో ఐదో (5Guarantee) గ్యారంటీ రెడీ అవుతోంది. ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ళ పథకం (Indiramma Housing Scheme) ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించారు. అందుకోసం గైడ్ లైన్స్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ళు లేని నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చబోతోంది. అందుకోసం స్థలం ఉన్నవాళ్ళకి 5 లక్షల రూపాయలను ప్రభుత్వం ఇవ్వబోతోంది. స్థలం లేకపోతే జాగాతో పాటు 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. మొదటి దశలో ఒక్కో నియోజకవర్గానికి 3 వేల 500 ఇళ్ళను కేటాయించబోతున్నారు.
పేదోడి సొంతింటి కలను నేరవేర్చేందుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) సిద్ధమైంది. 5లక్షల రూపాయలను ఇంటి నిర్మాణానికి ఇవ్వబోతోంది. ఈ మొత్తాన్ని లబ్దిదారుడికి ఎన్ని కిస్తీల్లో… ఇళ్ళు కట్టుకుంటున్నప్పుడు ఏయే దశల్లో ఇవ్వాలన్న దానిపై అధికారులు గైడ్ లైన్స్ తయారు చేయబోతున్నారు. ఇల్లు ఎలా నిర్మించుకోవాలి అన్నది లబ్దిదారుడి ఇష్టానికే వదిలేస్తారు. ఇళ్ళ డిజైన్లను కొన్నింటిని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే వంట గది, టాయ్ లెట్ తప్పనిసరిగా ఉండేలా చూస్తారు. ఇళ్ళ నిర్మాణంలో అక్రమాలు జరక్కుండా… జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల్లోఉన్న ఇంజినీరింగ్ విభాగాలకు పనులను అప్పగిస్తారు.
ఇందిరమ్మ ఇళ్ళ కోసం ప్రజాపాలనలో అప్లయ్ చేసుకున్న పేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. BRS డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణంలో జరిగిన తప్పులు మళ్ళీ జరక్కుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఈ పథకం కూడా ప్రారంభమైతే కాంగ్రెస్ ఐదో గ్యారంటీని అమలు చేసినట్టు అవుతుంది. లోక్ సభ ఎన్నికలకు ముందే పథకం ప్రారంభిస్తుండటంతో తమకు మైలేజ్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.