ఆర్బీఐ తాజగా రూ. 2000 నోట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన డిపాజిట్ గడువును పెంచుతూ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ గడువును 2023 అక్టోబర్ 7 వరకూ పెంచుతున్నట్లు తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ ఏడాది మే 19న రూ.2000 నోటు ఉపసంహరించుకున్నట్లు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా సెప్టెంబర్ 30 వరకూ గడువును ఇస్తూ కీలక ఆదేశాలు గతంలో జారీ చేసింది. అయితే సెప్టెంబర్ మాసాంతంలో వరుస సెలవులు, వారాంతాలు రావడంతో మరో 7 రోజుల గడువు పొడిగిస్తూ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1 నాటికి ఆర్బీఐ చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు 93 శాతం రూ. 2000 నోట్లు మార్కెట్లో నుంచి ఆర్బీఐకి చేరినట్లు ప్రకటించింది. వీటి మొత్తం విలువ రూ. 3.32 లక్షల కోట్లుగా పేర్కొంది. అయితే మార్కెట్లో ఇంకా రూ 24 వేల కోట్ల వరకూ వినియోగంలో ఉన్నట్లు అంచనా వేసింది. అందుకే మరో వారం గడువు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఎన్నరైలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఆర్బీఐ కి వచ్చి చేరిన మొత్తం నోట్లలో 87శాతం డిపాజిట్ల రూపంలో రాగా మిగిలిన 13 శాతం ఎక్స్ చేంజ్ చేసుకున్నట్లు తెలిపింది.
అక్టోబర్ 7 తరువాత ఇలా చేయవచ్చు..
వినియోగదారుల సౌకర్యార్థం ఆర్బీఐ మరో అంశాన్ని వెల్లడించింది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 7 వరకూ ఉపసంహరణ గడువును పొడిగిస్తూ అక్టోబర్ 8 తరువాత ఎలా మార్చుకోవచ్చో తెలిపింది. ఆర్బీఐ ఇచ్చిన రెండవ అవకాశాన్నికూడా వినియోగించుకోలేక పోతే ఆర్బీఐ జారీ చేసిన 19 కార్యాలయాల్లో వెళ్లి మార్చుకోవచ్చు. ఒకేసారి రూ.20వేల వరకూ మార్పిడి చేసుకోవచ్చు. అలాగే న్యాయస్థానాలు, చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వ రంగ సంస్థలు, ఎన్ ఫోర్స్మెంట్ , సీబీఐ, సీఐడీ, ఎన్ఐఏ వంటి దర్యాప్తు సంస్థలు అక్టోబర్ 7 తరువాత కూడా నేరుగా ఆర్బీఐ ఏర్పాటు చేసిన 19 కార్యాలయాల్లో వెళ్లి జమచేయవచ్చు.
T.V.SRIKAR