BGTలో మనదే ఆధిపత్యం, దుమ్మురేపిన సచిన్, కోహ్లీ

ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంతో చరిత్ర ఉంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ టెస్ట్ సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

  • Written By:
  • Publish Date - November 22, 2024 / 11:25 AM IST

ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంతో చరిత్ర ఉంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ టెస్ట్ సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. టీ ట్వంటీ ఫార్మాట్ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లోనూ ఈ టెస్ట్ సిరీస్ పై ఆసక్తి ఉందంటే దానికి కారణం ఇరు జట్ల మధ్య జరిగే హోరాహోరీ పోరులే అనడంలో ఎలాంటి డౌట్ లేదు. చాలా సందర్భాల్లో అనూహ్య మలుపులు తిరుగుతూ ఈ ట్రోఫీ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. నవంబర్ 22 నుంచి పెర్త్‌ వేదికగా జరిగే తొలి టెస్టుతో సిరీస్‌ మొదలుకానుంది. భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరిగే ఈ సిరీస్‌కు 28 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ సిరీస్‌ను గెలవడాన్ని ఇరుజట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. ఈ చారిత్రాత్మక సిరీస్ లో టీమిండియాదే ఆధిపత్యంగా ఉంది. 1996 -97 సీజ‌న్‌లో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ ప్రారంభ‌మైంది. టెస్టుల్లో ప‌దివేల ప‌రుగులు పూర్తిచేసిన టీమిండియా లెజెండ్ సునీల్ గ‌వాస్క‌ర్‌…ఆస్ట్రేలియా దిగ్గ‌జం అలెన్ బోర్డ‌ర్ పేరు మీద ఈ బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని ఐసీసీ ప్రారంభించింది. ఈ సిరీస్ నిర్వ‌హించిన తొలి ఏడాది 1-0 తేడాతో టీమిండియా గెలిచింది.

ఇప్ప‌టివ‌ర‌కు ప‌ద‌హారు సార్లు బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ జ‌ర‌గ్గా…టీమిండియా ప‌దిసార్లు విజేత‌గా నిలిస్తే…ఆస్ట్రేలియా ఐదుసార్లు టైటిల్ గెలిచింది. ఒకసారి సిరీస్ సమమైంది. గ‌త నాలుగు పర్యాయాలుగా వ‌రుస‌గా టీమిండియానే విజేతగా నిలుస్తూ వ‌స్తోంది. ఐదోసారి క‌ప్‌ను గెలుచుకొని రికార్డ్‌ను మ‌రింత ప‌దిలం చేసుకోవాల‌ని భావిస్తోంది.
బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఇప్ప‌టివ‌ర‌కు ఇండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య 56 మ్యాచ్‌లు జ‌ర‌గ్గా…ఇండియా 24 మ్యాచుల్లో, ఆస్ట్రేలియా 20 మ్యాచుల్లో విజ‌యాన్ని సాధించింది. 12 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.అయితే ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై 27 మ్యాచ్‌ల్లో తలపడితే 14 మ్యాచుల్లో ఏడింటిలో మాత్ర‌మే టీమిండియా గెలిచింది. 14 మ్యాచ్ లలో కంగారూలు గెలవగా.. మ‌రో ఏడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

ఇక వ్యక్తిగత రికార్డుల్లోనూ మనదే పైచేయిగా ఉంది. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో అత్య‌ధిక ర‌న్స్ రికార్డ్ స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉంది. సచిన్ 56 ఇన్నింగ్స్‌ల‌లో 3262 ర‌న్స్ చేశాడు స‌చిన్‌. రికీ పాటింగ్ 2555 పరుగులు, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ 2434 పరుగులతో టాప్ త్రీలో ఉన్నారు. 2143 ర‌న్స్‌తో ద్రావిడ్ నాలుగో స్థానంలో నిల‌వ‌గా…2033 ర‌న్స్‌తో పుజారా ఆరు, 1979 ర‌న్స్‌తో కోహ్లి ఏడో స్థానంలో కొన‌సాగుతోన్నాడు. మ‌రో 458 ర‌న్స్ చేస్తే స‌చిన్‌ను అధిగ‌మించి కోహ్లి ఫ‌స్ల్ ప్లేస్‌లోకి వ‌స్తాడు. ఈ టోర్నీలో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్‌గా కూడా సచినే ఉన్నాడు.ఈ సిరీస్‌లో స‌చిన్ తొమ్మిది సెంచ‌రీలు సాధించాడు. ఎనిమిది సెంచ‌రీల‌తో స‌చిన్ త‌ర్వాత కోహ్లి సెకండ్ ప్లేస్‌లో కొన‌సాగుతోన్నాడు. బౌలర్ల రికార్డుల్లో మాత్రం అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నాథ‌న్ ల‌యాన్ రికార్డ్ నెల‌కొల్పాడు. అశ్విన్ , కుంబ్లే , హ‌ర్భ‌జ‌న్ సింగ్, జ‌డేజా త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు.