ఇలాగేనా ఆడేది ? భారత జట్టుపై సచిన్ ఫైర్

న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ను 0-3 తో ఓడిపోవడాన్ని భారత్ ఫాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. అటు మాజీ ఆటగాళ్ళు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయని భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను సైతం ఈ ఓటమి తీవ్రంగానే బాధించింది.

  • Written By:
  • Publish Date - November 4, 2024 / 03:06 PM IST

న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ను 0-3 తో ఓడిపోవడాన్ని భారత్ ఫాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. అటు మాజీ ఆటగాళ్ళు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయని భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను సైతం ఈ ఓటమి తీవ్రంగానే బాధించింది. సోషల్ మీడియా వేదికగా సచిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. భారత్ ఓటమికి మూడు కారణాలను చెప్పాడు. సన్నద్ధత లోపం, చెత్త షాట్ల ఎంపిక, మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం ఘోర పరాజయానికి కారణాలుగా పేర్కొన్నాడు. భారత జట్టు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించాడు. సొంతగడ్డపై 0-3తో టెస్టు సిరీస్ కోల్పోవడం జీర్ణించుకోలేని విషయమని అభిప్రాయ పడ్డాడు. ఆత్మపరిశీలన చేసుకునే సమయం ఇదేనని, . సన్నద్ధత లోపమా… పేలవ షాట్ల ఎంపికనా..లేదా మెరుగైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడమా…అనేది గుర్తించాలని సూచించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్, రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్ధశతకాలు బాదిన రిషభ్ పంత్‌ను సచిన్ కొనియాడాడు.తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ దృఢత్వాన్ని ప్రదర్శించాడన్నాడు. రిషభ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో గొప్పగా ఆడాడనీ కితాబిచ్చాడు. తన ఫుట్ వర్క్‌తో కఠినమైన పిచ్‌ను విభిన్నమైనదిగా చూపించాడనీ ప్రశంసించాడు. అతను నిజంగా ఓ అద్భుతమనీ కొనియాడాడు. ఈ విజయానికి ఇక న్యూజిలాండ్‌కు పూర్తి క్రెడిట్ ఇవ్వాలన్న సచిన్ సిరీస్ మొత్తం నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుందన్నాడు. భారత్‌పై 3-0తో గెలవడం గొప్ప ఫలితమని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు.

నిజానికి ఈ సిరీస్ ఆరంభం నుంచి భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. తొలి టెస్టులో 46 రన్స్ కే కుప్పకూలిన టీమిండియా రెండు , మూడు టెస్టుల్లో కూడా చెత్త బ్యాటింగ్ తోనే పరాజయం పాలైంది. అసలు ఒక్క టెస్ట్ కూడా కివీస్ గెలవదని అనుకుంటే ఏకంగా మూడుకు మూడు టెస్టుల్లో భారత్ ను చిత్తు చేసింది.స్వదేశంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ వైట్ వాష్‌కు గురికావడం ఇదే తొలిసారి. అంతేగాక ఈ ఏడాది సొంతగడ్డపై భారత్ ఓడిన టెస్టులు నాలుగు. 1969 తర్వాత స్వదేశంలో ఓ ఏడాది అత్యధిక టెస్టులు ఓడటం ఇదే ప్రథమం.