భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందుల్కర్ క్రికెట్ కెరీర్ పేలవంగా నడుస్తుంది. అర్జున్ తండ్రికి తగ్గ తనయుడు అన్న బిరుదును ఇంకా పొందలేకపోతున్నాడు. వరుస వైఫల్యాలు అతన్ని వెంటాడుతున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఐపీఎల్ లోనూ సత్తా చాటలేకపోతున్నాడు. తాజాగా జరిగిన వేలంలో కనీస ధర 30 లక్షలకు అతడిని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అది కూడా సచిన్ మొహం చూసి ముంబై అర్జున్ ని కొనుగోలు చేయాల్సి వచ్చింది. మెరుగైన ప్రదర్శన లేకపోవడంతో అతను తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఏకంగా జట్టులో స్థానం కోల్పోయాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతని నిరాశాజనక ప్రదర్శన కారణంగా గోవా ప్లేయింగ్ ఎలెవెన్లో అర్జున్ కు స్థానం దక్కలేదు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ 4 ఓవర్లలో 48 పరుగులు సమర్పించి ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. బ్యాటింగ్‌లోనూ నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులు మాత్రమే అందించగలిగాడు. ఈ క్రమంలో ముంబై చేతిలో గోవా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లోనూ అర్జున్ వికెట్ తీయలేకపోయాడు. దీంతో గోవా టీం అర్జున్ ని పక్కనపెట్టాల్సి వచ్చింది. నిజానికి ఈ టోర్నీలో గోవా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఈ వైఫల్యాలు గోవా జట్టుకే కాకుండా అర్జున్ వ్యక్తిగతంగా కూడా తీవ్ర ఆత్మవిమర్శలకు కారణమయ్యాయి. నిజానికి అర్జున్ సచిన్ కొడుకు కావడంతో వరుస అవకాశాలు లభిస్తున్నాయి. కానీ వికెట్లు పడగొట్టడంతో విఫలమవుతూనే ఉన్నాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోవా తరుపున అర్జున్ రాణిస్తాడని అంతా భావించారు. ఐపీఎల్ కి ముందు జరుగుతున్న ఈ కీలక టోర్నీలో తనను తాను ప్రూవ్ చేసుకునే గొప్ప అవకాశం లభించినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. 25 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు మొత్తం 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు, అందులో అతను ఒక సెంచరీ మరియు రెండు అర్ధ సెంచరీల సహాయంతో 37 వికెట్లు మరియు 532 పరుగులు చేశాడు.15 లిస్ట్ A మ్యాచ్‌లలో 21 వికెట్లు మరియు 62 పరుగులు చేశాడు. అర్జున్ 24 టీ20 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు, 119 పరుగులు చేశాడు.