బిగ్‌బాస్ ఫ్యాన్స్‌పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామంటూ హెచ్చరించారు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు. దీంతో ఓ కామన్ మ్యాన్ బిగ్‌బాస్ టైటిల్ గెలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు. సీరియల్ యాక్టర్ అమర్‌దీప్ రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ ఫినాలే జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్‌కు అమర్, ప్రశాంత్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ప్రశాంత్‌ను విజేతగా ప్రకటించగానే సంబరాలు అంబరాన్ని అంటాయి. ఐతే అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం.. పరస్పరం దాడులకు దారితీసింది. ఒకరినొకరు పిడిగుద్దులు కొట్టుకున్నారు. ఇక్కడితో ఆగారా అంటే.. 6 సిటీ బస్సులపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. ఇరువర్గాలను చెదరగొట్టారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. బస్సుల దాడి ఘటనపై.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు.
ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి మంచిది కాదు.. జనాలను సేఫ్‌గా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే.. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు జనాల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు సజ్జనార్. ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇలాంటి సంఘటనలను ఉపేక్షించదని.. TSRTC బస్సులు జనాల ఆస్తి. వాటిని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ట్వీట్ చేశారు. సజ్జనార్ ట్వీట్‌పై ఇప్పుడు నెటిజన్లు.. పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. అభిమానం ఉండాలి కానీ.. ఆస్తులు ధ్వంసం చేసేంత ఉండొద్దు.. ఆనందమైనా, అభిమానం అయినా హద్దుల్లో ఉండాలి తప్ప.. పిచ్చివేషాలు వేయడం కరెక్ట్ కాదు అంటూ పోస్టులు పెడుతున్నారు.