ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మెనూ… ఒక చోట సమోసా 7 రూపాయలు ఉంటే… మరో చోట 10 ఉండొచ్చు… ఇంకో చోట 15 రూపాయలు ఉండొచ్చు… సార్వత్రిక ఎన్నికల వేళ… కేంద్ర ఎన్నికల కమిషన్ మోనూ రేట్లను రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చులో ఏ ఫుడ్ ఐటెమ్ కి రేటు ఎంత ఉండాలో డిసైడ్ చేసింది.
అసెంబ్లీ లేదా పార్లమెంట్… ఏ ఎలక్షన్స్ లో నిలబడిన అభ్యర్థులకైనా ఈసీ నిర్ధారించిన లోపే ఎన్నికల వ్యయం చేయాల్సి ఉంటుంది. లోక్ సభ ఎన్నికలకు ఒక్కో అభ్యర్థి రూ.95 లక్షల లోపు ఖర్చు చేయాలి… అదే గోవా, సిక్కిం రాష్ట్రాల్లో అయితే రూ.75 లక్షలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.75-95 లక్షల మధ్య ఎన్నికల వ్యయం ఉంది. నామినేషన్ ఫైల్ చేసినప్పటి నుంచి ఫలితాలు వెల్లడి తేదీ వరకూ అభ్యర్థులు ఎంత ఖర్చు చేస్తున్నారో ఈసీ కూడా అధికారులతో నిఘా పెడుతుంది. అభ్యర్థులు తమ అనుచరుల కోసం పెట్టే ఫుడ్డు ఖర్చే కాదు… ప్రచారం కోసం ఉపయోగించే బ్యానర్లు, కటౌట్లు, మైకులు, ఫ్లెక్సీలు, సభా వేదిక ఖర్చులు, తిరగడానికి వాడే వాహనాలు, హెలికాప్టర్లు… ఇలా ప్రతి ఖర్చు కూడా అభ్యర్థుల ఖాతాల్లోనే పడుతుంది. కానీ ఈసీ ఇచ్చే మెనూ కార్డుకీ… వాస్తవ ధరలకూ అస్సలు పొంతన ఉండదు. ప్రస్తుతం డబుల్ రేట్లు ఉన్నా… ఈసీ మాత్రం తన దారి తనదే అన్నట్టుగా రేట్లు ఫిక్స్ చేస్తుంది. దాంతో నెటిజన్లు సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు.
ఛాయ్ రేటును ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా నిర్ణయించింది ఈసీ. ప్రాంతాన్ని బట్టి కప్పు ఛాయ్ 5 నుంచి 15 రూపాయల దాకా ఉంది. మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ లో కప్పు చాయ్ 5 రూపాయలు, సమోసా 10 రూపాయలు ఉన్నాయి. ఇడ్లీ-సాంబార్, పోహా-జిలేబీ 20 రూపాయలు ఉంటే, దోశ, ఉప్మా ప్లేట్ రేటు 30రూపాయలుగా ఈసీ నిర్ధారించింది. ఈసీ మెనూలో చికెన్, చేపలు, మాంసం రేట్లు కూడా ఉన్నాయి. కిలో చికెన్ కు రూ.250, మటన్ రూ.500 దాకా ఉన్నాయి. 2019లో ఈసీ ఇచ్చిన మోనూతో పోలిస్తే చెన్నైలో ఛాయ్ ధరలను రూ.10 నుంచి 15కు పెంచింది. కాఫీ కూడా 15 నుంచి 20కి పెంచింది. కానీ ఇక్కడ చికెన్ బిర్యానీ రేటు మాత్రం తగ్గించింది. గతంలో 180 ఉన్న చికెట్ బిర్యానీ ఇప్పుడు 150గా రేటు ఫిక్స్ చేసింది ఈసీ. వాస్తవంగా చూస్తే… గతం కంటే రేట్లు పెరిగినా… ఇప్పుడు ఎందుకు తగ్గించింది… అదెలా సాధ్యమైందో… ఈసీ అధికారులకే తెలియాలి.
ఇవే కాకుండా అభ్యర్థులు ఉపయోగించే హెలిప్యాడ్లు, లగ్జరీ వెహికిల్స్, ఫామ్ హౌజ్ లు, పూలు, కూలర్లు, టవర్ ఏసీలు, సోపాలకు కూడా ఈసీ రేట్లు ఫిక్స్ చేసింది. పూల దండల్లో కూడా గులాబీ, బంతి ఇలా ఒక్కో రకం పూల దండకు ఒక్కో రేటును నిర్ణయించింది. మార్కెట్లో రేట్లకు, ఈసీ ధరలకూ చాలా డిఫరెన్స్ ఉంది. అయినా అభ్యర్థులు పేరుకే ఎన్నికల కమిషన్ నిర్ణయించిన రేట్లను చూపిస్తున్నారు. కానీ లోక్ సభ నియోజకవర్గంలో 100 కోట్లకు పైగా, అసెంబ్లీలో అయితే 50 కోట్ల రూపాయలైనా ఖర్చు పెడుతున్నారు. అవేమీ ఈసీ లెక్కల్లోకి ఎందుకు రావో… ఏమో…