నా సక్సెస్ వెనుక సూర్యా భాయ్, సంజూ శాంసన్ కామెంట్స్

టీ ట్వంటీ ఫార్మాట్ లో శతకం అంటే ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే...ఒక సెంచరీ కొట్టడమే కష్టం...అలాంటిది వరుసగా రెండు సెంచరీలు బాదితే ఆ కిక్కే వేరు...ప్రస్తుతం ఇలాంటి కిక్కును సంజూ శాంసన్ ఆస్వాదిస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - November 9, 2024 / 05:45 PM IST

టీ ట్వంటీ ఫార్మాట్ లో శతకం అంటే ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే…ఒక సెంచరీ కొట్టడమే కష్టం…అలాంటిది వరుసగా రెండు సెంచరీలు బాదితే ఆ కిక్కే వేరు…ప్రస్తుతం ఇలాంటి కిక్కును సంజూ శాంసన్ ఆస్వాదిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్ లో బంగ్లాదేశ్ పై తొలి టీ ట్వంటీ సెంచరీ చేసిన సంజూ తాజాగా సౌతాఫ్రికా పై కూడా శతకం సాధించాడు. తద్వారా అంతర్జాతీయ టీ ట్వంటీల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన సంజూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తనపై ఎంతో నమ్మకాన్ని ఉంచాడని గుర్తు చేసుకున్నాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ సమయంలోనే వచ్చే 7 మ్యాచ్ ల్లో తానే ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తానని సూర్య చెప్పిన విషయాన్ని వెల్లడించాడు. తాను ఎన్ని పరుగులు చేసినా సమస్య లేదని ప్రోత్సహించాడంటూ ఎమోషనల్ అయ్యాడు. కెప్టెన్ తో పాటు కోచ్, టీమ్ మేనేజ్ మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం బాగా సంతోషాన్నిచ్చిందన్నాడు.

మంచి ఉద్దేశంతో ఆడటంతోనే ఈ సెంచరీ చేయగలిగానని చెప్పాడు. దూకుడుగా ఆడటం.. వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు కోసం ఆడాలని మా జట్టులో ఎప్పుడూ మాట్లాడుకుంటామన్నాడు. మూడు-నాలుగు బంతులు ఆడగానే తనకు బౌండరీ కొట్టాలనిపిస్తోందనీ, కానీ ఈ మ్యాచ్ లో తాను అలా ఆలోచించలేదని చెప్పుకొచ్చాడు.
ఈ క్షణం కోసం గత 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాని తెలిపాడు. తాను ఎక్కువగా ఆలోచిస్తే కన్నీళ్లు వస్తాయనీ,. ఈ సక్సెస్ అంత సులువుగా దక్కలేదని భావోద్వేగానికి గురయ్యాడు. ఇన్నాళ్లకు తాను కోరుకున్నది దక్కినందుకు సంతోసంగా ఉందన్నాడు. కానీ తన కాళ్లను నేను నేలపైనే ఉంచాలనుకుంటున్నట్టు సంజూ శాంసన్ వ్యాఖ్యానించాడు.

ఈ సిరీస్‌లో శుభారంభం చేయడం చాలా ముఖ్యమన్నాడు. సొంతగడ్డపై సౌతాఫ్రికా ఎంత ప్రమాదకరమైన జట్టో తమకు బాగా తెలుసన్నాడు. పెద్ద విజయంతో సిరీస్ లో శుభారంభం చేసినందుకు హ్యాపీగా ఉందన్న సంజూ ఇదే జోరు కొనసాగించాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్ లో విధ్వంసకర బ్యాటింగ్ చేసిన సంజూ శాంసన్ కేవలం 50 బంతుల్లోనే 107 పరుగులు చేశాడు. సంజూ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. అంటే 88 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలోనే వచ్చాయి.